ఉద్యోగం నుండి తొలగిస్తే పరిహారంపై పన్ను ఉపశమనం ఇలా: ఫామ్ 10Eని ఇలా సమర్పించాలి
కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. యజమాని ఉద్యోగం నుండి తొలగించినప్పుడు లేదా ఉద్యోగం మానివేసినప్పుడు యజమాని నుండి పొందిన ఏదైనా పరిహారంపై వేతనం వలె పన్ను ఉంటుంది. ఉద్యోగం కోల్పోయినప్పుడు కంపెనీ నుండి ఉద్యోగికి వచ్చే పరిహారంపై పన్ను రాయితీ లభిస్తుంది. ఈ రాయితీని క్లెయిమ్ చేసుకోలేని పక్షంలో మీ ట్యాక్స్ స్లాబ్‌కు అనుగుణంగా పన్ను చెల్లించాలి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 89, ఐటీ రూల్స్, 1962లోని రూల్ నెంబర్ 21ఏ ప్రకారం రాయితీని పొందవచ్చు.

వీటిపైనా పన్ను రాయితీ
ఈ ఆదాయంపై ఉద్యోగి పన్ను ఉపశమనం పొందవచ్చు. రద్దుపై పరిహారం కాకుండా సెక్షన్ 89 కింద ఉపశమనం అనేక ఇతర రకాల ఆదాయాలపై అనుమతించబడుతుంది. ఉద్యోగం కోల్పోయినందుకు కంపెనీ ఇచ్చే పరిహారంతో పాటు మరిన్ని రాబడులపై పన్ను రాయితీ పొందవచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత వచ్చే ముందస్తు వేతన చెల్లింపులు, వేతన బకాయిలు, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ముందస్తు ఉపసంహరణ, పెన్షన్ బకాయిలపై కూడా పన్ను రాయితీని పొందవచ్చు.

ఏదో ఒకటి వినియోగించుకోవాలి
వీఆర్ఎస్ తీసుకునే వారు పొందే పరిహారంపై రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. రాయితీ వర్తించదు. రాయితీ కావాలనుకుంటే మినహాయింపు ఉండదు. వీఆర్ఎస్ తీసుకున్న వ్యక్తులు రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లేదా సెక్షన్ 89 ప్రకారం పన్ను రాయితీ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది.

పన్ను రాయితీ క్లెయిమ్
పరిహారం పొందిన ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో పన్ను రాయితీని క్లెయిమ్ చేసుకోవాలి. ఇందుకు ఫారమ్ 10ఈ సమర్పించాలి. ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ముందే ఈ ఫామ్‌ను సమర్పించాలి. ఆదాయపన్ను పోర్టల్‌లో ఇది అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications