For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ జియో తో పోటీ: ఫ్లిప్‌కార్ట్‌లోకి 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడి!

|

కేవలం రెండు నెలల్లోనే రూ 1 లక్ష కోట్లకు పైగా నిధులను సమీకరించి జోరు మీదున్న రిలయన్స్ జియో తో పోటీ పడాలంటే ప్రత్యర్థులకు వణుకు పుడుతోంది. ముఖ్యంగా ఈ కంపెనీ ఇప్పటి వరకు టెలికాం సేవలకు పరిమితమైనా ... త్వరలోనే పెద్ద ఎత్తున ఈ కామర్స్ రంగంలోకి ప్రవేశిస్తుండటం తెలిసిందే. వస్తూ వస్తూనే టెలికాం రంగంలో విప్లవం సృష్టించినట్లే ... ఈ కామర్స్ లో కూడా రిలయన్స్ జియో ఏదో మేజిక్ చేస్తుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే భారత ఈ కామర్స్ రంగంలో పాతుకుపోయిన ఫ్లిప్కార్ట్, అమెజాన్ లపై ఒత్తిడి పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో భారత్ లో తమ సత్తా చాటుకునేందుకు, మార్కెట్ వాటాను కాపాడుకునేందుకు వేటికవే సొంత వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సాధారణంగానే ఈ కామర్స్ రంగంలో నిలదొక్కుకునేందుకు భారీ స్థాయిలో నిధుల అవసరం ఉంటుంది. ఇక పోటీ విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు నిధుల అవసరం మరింత పెరుగుతుందని చెప్పాలి. సరిగ్గా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ విషయంలో అదే జరుగుతోంది. అమెజాన్ కు ఎలాగు నిధుల కొరత లేదు. పైగా భారత్ లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని ఇప్పటికే దాని యజమాని జెఫ్ బెజోస్ వెల్లడించిన విషయం తెలిసిందే.

1.10లక్షల హెక్టార్ల భూమి రెడీ: విశాఖ పోర్ట్ సహా.. ఉద్యోగాలు, ఉపాధి కోసం కేంద్రం కీలక నిర్ణయం!

నిధులు సమకూర్చిన వాల్మార్ట్...

నిధులు సమకూర్చిన వాల్మార్ట్...

దేశీయంగా ఎదిగిన ఫ్లిప్కార్ట్ ను చేజిక్కించుకున్న అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్... తాజాగా ఫ్లిప్కార్ట్ లోకి మరో 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ 9,000 కోట్లు) పెట్టుబడిని అందించింది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో ఇప్పటికే ఫ్లిప్కార్ట్ లో 80% వాటా కలిగిన వాల్మార్ట్ కు మరో 1% వాటా అదనంగా లభించనుందని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ఫ్లిప్కార్ట్ ను 16 బిలియన్ డాలర్లు చెల్లించి వాల్మార్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పడు కంపెనీ వాల్యుయేషన్ సుమారు 21 బిలియన్ డాలర్లు గా లెక్కకట్టారు. అయితే తాజా పెట్టుబడి పెట్టినప్పుడు ఫ్లిప్కార్ట్ వాల్యుయేషన్ ను 24.9 బిలియన్ డాలర్లు గా లెక్కకట్టినట్లు సమాచారం. ఈ పెట్టుబడి రెండు విడతల్లో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఫ్లిప్కార్ట్ కు లభిస్తుంది.

అందుకేనా...

అందుకేనా...

ప్రపంచ టాప్ టెన్ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇటీవల నిధుల సమీకరణలో తనకు తిరుగులేదని నిరూపించుకుంది. కేవలం రెండు నెలల వ్యవధిలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇందులో పెట్టుబడులు పెట్టింది ఆషామాషీ కంపెనీలు కాదు. పేస్బుక్ మొదలు కొని కేకేఆర్ వరకు దిగ్గజ సంస్థలు నిధులు సమకూర్చాయి. తాజాగా గూగుల్ కూడా సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో .. ఫ్లిప్కార్ట్ లోకి వాల్మార్ట్ మరో బిలియన్ డాలర్ కంటే అధిక నిధులు సమకూర్చటం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. రిలయన్స్ జియో త్వరలోనే అత్యంత వేగంగా ఈ కామర్స్ సేవలు ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి, ముందస్తు చర్చల్లో భాగంగా నిధుల కొరత లేకుండా చూడటం కోసం వాల్మార్ట్ ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ముక్కోణపు పోటీ...

ముక్కోణపు పోటీ...

ఇప్పటి వరకు ఇండియా లో ఈ కామర్స్ అంటే కేవలం రెండు కంపెనీలే గుర్తొస్తాయి. ఒకటి ఫ్లిప్కార్ట్ .. మరోటి అమెజాన్. మొత్తం మార్కెట్లో ఈ రెండు కంపెనీల వాటా 90% నికి పైగా ఉండటం విశేషం. కానీ త్వరలోనే ఈ జాబితాలోకి రిలయన్స్ జియో చేరిపోయే అవకాశం ఉంది. దీంతో ఇండియన్ ఈకామెర్స్ రంగంలో ముక్కోణపు పోటీ మొదలు కాబోతోంది. స్నాప్ డీల్ వంటి కొన్ని కంపెనీలు ఉన్నప్పటికీ వాటి విస్తృతి బాగా తగ్గిపోయింది. ఇతర చిన్న చితకా ఈ కామర్స్ రంగ కంపెనీలు మనుగడ కోసం పోరాడుతున్నాయి. కొన్నైతే ఇప్పటికే చేతులు ఎత్తేయటంతో వాటిని ఇతర దేశాల కంపెనీలు కొనేశాయి. షాప్ క్లూస్ ఇందుకొక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. వచ్చే నాలుగేళ్లలో ఇండియన్ ఈ కామర్స్ మార్కెట్ రూ 1,00,000 కోట్లకు పైగా చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది సుమారు రూ 40,000 కోట్ల స్థాయిలో ఉంది. ఏటా సగటున 20% నికి పైగా వృద్ధి నమోదు అవుతోంది. అందుకే అన్ని కంపెనీలు తమ తమ వ్యూహాలకు పదును పెట్టి మెజారిటీ మార్కెట్ వాటాను సంపాదించాలని ప్రయత్నిస్తున్నాయి.

English summary

Walmart to infuse $1.2 billion in Flipkart Group

US-based retail giant Walmart has infused $1.2 billion in Flipkart's commerce business valuing it at $24.9 billion, as the Indian online retail battle gets redrawn with Reliance Jio's plans to leverage its telecom reach to propel online commerce.
Story first published: Thursday, July 16, 2020, 9:46 [IST]
Company Search