LIC News: ఎల్‌ఐసీ తలరాత మార్చేందుకు కేంద్రం కొత్త ప్లాన్.. ఇన్వెస్టర్లు సేఫేనా..? రద్దు సరైనదేనా..
LIC News: ఎల్ఐసీ అనే పేరు వినపడగానే మనందరికీ గుర్తొచ్చేది నమ్మకం. ఆ నమ్మకంతోనే చాలా మంది చిన్న రిటైల్ పెట్టుబడిదారులు ఆ కంపెనీ ఐపీవోలో తమ పెట్టుబడులను పెట్టారు. కానీ.. ఆ తర్వాతే కథ మెుత్తం మారిపోయింది. ఏమైందో తెలియదు కానీ కంపెనీ సంపద కాలం గడిచే కొద్దీ క్షీణించటం మెుదలైంది. అయితే దీనిని సమర్ధవంతంగా సరిదిద్ధేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికతో ముందుకు వస్తోంది. ఇది ఇన్వెస్టర్లను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకుందాం.

కొత్త నాయకత్వం..
ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రైవేట్ సెక్టార్ నుంచి ఒక రథసారధిని నియమించాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటి వరకు బీమా దిగ్గజానికి ఛైర్మన్ నాయకత్వం వహించేవారు. అయితే ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న వ్యక్తి పదవీకాలం మార్చిలో ముగియనుంది. ఆ తర్వాత ఈ పదవిని రద్దు చేసి ప్రైవేటు రంగం నుంచి ఒక నిపుణుడిని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఇద్దరు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ పగ్గాలు ప్రైవేటు వ్యక్తి చేతికి వెళతాయి.

చరిత్రలో తొలిసారిగా..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెుత్తం రూ.41 లక్షల కోట్లుగా ఉంది. ఈ తరుణంలో సంస్థ 66 ఏళ్ల చరిత్రలో మెుదటిసారిగా సంస్థకు నాయకత్వం వహించడానికి ఒక ప్రైవేటు రంగంలోని వ్యక్తిని ప్రభుత్వం నియమించటం సంచలనంగా మారింది. ఈ నియామకం వల్ల కంపెనీ భవిష్యత్తు వృద్ధి వేగాన్ని అందుకుంటుందా అనే విషయం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. ఎందుకంటే ఎల్ఐసీ అనేది కేవలం పేరు కాదు కోట్ల మంది ప్రజల నమ్మకం కావటం ఇక్కడ కీలకం. అయితే ఈ అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖను వివరణ కోరగా ఎలాంటి ప్రతిస్పందన రాలేదని తెలుస్తోంది.

చట్టాల్లో మార్పులు..
ప్రభుత్వ రంగంలోని కంపెనీని నడిపించేందుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ని ప్రభుత్వం నియమింటానికి చట్టపరమైన చిక్కులు ఉంటాయి. దీనికి అనుగుణంగా గత ఏడాది ఎల్‌ఐసీని నియంత్రించే చట్టంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన మార్పులు చేసింది. అయితే ఇది ఇన్వెస్టర్లకు, ఇతర వాటాదారులకు మంచి సంకేతాలను పంపుతోందని అధికారులు అంటున్నారు. కొత్తగా నియమించబడే వ్యక్తి ఏ రంగానికి చెందినవారనే వివరాలను ప్రస్తుతానికి అధికారులు వెల్లడించలేదు.

ఐపీవో తర్వాత..
మే నెలలో ఎల్ఐసీ ఐపీవో మార్కెట్లోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అప్పటి ఇష్యూ ధర కంటే స్టాక్ దాదాపు 30 శాతం తక్కువ ధరకు ట్రేడ్ అవుతోంది. దీని కారణంగా ఇన్వెస్టర్ల సంపద దాదాపుగా రూ.2 లక్షల కోట్ల వరకు తుడిచిపెట్టుకుపోయింది. ప్రైవేటు రంగంలోని చాలా బీమా కంపెనీల షేర్లు ఎల్ఐసీ కంటే మంచి పనితీరు కనబరచటం చాలా మంది ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే కంపెనీ పనితీరు విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని మాజీ ఫైనాన్స్ సెక్రటరీ, సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు.