ప్లీజ్.. చైనా కంపెనీవి చూపించొద్దు: రిటైలర్స్‌కు షాక్, ఆ దెబ్బతో 'మేడిన్ ఇండియా లోగో'
సరిహద్దుల్లో చైనా కుయుక్తుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భారతీయులు డ్రాగన్ ఉత్పత్తులను బహిష్కరిస్తామని చెబుతున్నారు. 20 మంది భారత జవాన్ల ప్రాణాలు హరించిన చైనాపై ఆగ్రహంతో కొంతమంది చైనీస్ ఉత్పత్తులు విక్రయిస్తున్న స్టోర్స్‌పై తిరగబడుతున్నారు. దాడుల భయంతో చైనీస్ హ్యాండ్‌సెట్ మేకర్ షియోమీ తమ బ్రాండింగ్‌ను వైట్ కలర్‌లో మేడిన్ ఇండియా లోగోతో కవర్ చేస్తోందట. ఈ మేరకు ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) వెల్లడించింది.

మేడిన్ చైనా స్థానంలో మేడిన్ ఇండియా
ఈ మేరకు AIMRA చైనీస్ మొబైల్ బ్రాండ్స్‌కు లేఖ రాసింది. పరిస్థితి సద్దుమణికే వరకు రిటైలర్స్‌కు మేడిన్ చైనా బ్రాండ్స్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని, క్లాత్ లేదా ఫ్లెక్స్ లేదా స్టోర్ ముందు భాగంలోని బోర్డుపై దీనిని తొలగించాలని సూచించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో షియోమీ (ఎంఐ) ఇప్పటికే మేడిన్ ఇండియా బ్యానర్స్ ఉపయోగిస్తుందని తెలిపారు. ఇతర కంపెనీలు ఇంకా అలాంటి చర్యలు ప్రారంభించలేదని, అయితే పరిస్థితులు గమనిస్తున్నామని తెలిపింది. అయితే దీనిపై షియోమీ స్పందించలేదట.

అందుకే ప్రత్యామ్నాయం
ఇప్పటికే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) చైనా వస్తువులను బహిష్కరిస్తామని పిలుపునిచ్చింది. ప్రజల నుండి కూడా ఆశించిన మద్దతు లభిస్తోంది. చైనా దుందుడుకు చర్యల కారణంగా ఇక్కడ చైనీస్ మొబైల్ ఫోన్స్ స్టోర్స్ భద్రతపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం చిల్లర వ్యాపారులను దెబ్బతీయవద్దని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్లు AIMRA జాతీయ అధ్యక్షుడు అరవింద్ ఖురానా తెలిపారు.

చైనా వస్తువులు వద్దండీ..
గాల్వాన్ ఘటన అనంతరం చాలామంది చైనా వస్తువులను చూపించవద్దని కోరుతున్నారని ఖురానా చెప్పారు. చైనా వస్తువులు కాకుండా కాస్త ఖరీదైనా పర్లేదు ఇతర వస్తువులు చూపించమని చెబుతున్నారని అంటున్నారు. కేవలం మొబైల్ ఫోన్లే కాదు.. ప్లాస్టిక్ నుండి వివిధ వస్తువుల దుకాణాల్లోను ఇదే కనిపిస్తోంది. చైనా వస్తువులకు బదులు మేడిన్ ఇండియా వస్తువులు.. అవీ లేకుంటే ఇతర దేశ వస్తువులు అడుగుతున్నారట. కానీ సాధ్యమైనంత వరకు చైనా వస్తువులు పక్కన పెడుతున్నారట.


Click it and Unblock the Notifications