Success Story: 2008 మాంద్యం.. ట్రేడింగ్ లో రూ.80 లక్షలు నష్టం.. కంపెనీ పెట్టి విజయం..
Success Story: అది 2008 ఆర్థిక మాంద్యం సమయం. స్టాక్ మార్కెట్లో సంపాదించాలని పెట్టుబడులు పెట్టిన వారి కలలు పేక మేడల్లా కూలిపోయిన సమయం. ఏది ముట్టుకున్నా నష్టమే. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ వల్ల అక్షరాలా రూ.80 లక్షలను నష్టపోయాడు అజయ్ లఖోటియా. అయినా మార్కెట్లపై మక్కువతో ఆసియాలోనే మెుట్టమెుదటి సామాజిక పెట్టుబడి వేదిక స్టాక్‌గ్రోను స్థాపించాడు. విజయవంతంగా దానికి సీఈవోగా ముందుకు నడుపుతున్నారు. ఆయన సక్సెస్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం..

లాభాల ఆశలో..
దశాబ్దం క్రితం స్టాక్ మార్కెట్లో మెుదలైన అజయ్ లఖోటియా ప్రయాణం విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఎలాంటి సంక్షోభం వచ్చినా తనలాగా ఇన్వెస్టర్లు నష్టాల పాలు కాకూడదని భావించి ఒక ఫార్ములాను చెప్పాడు.మాంద్యానికి ముందు 2008లో మార్కెట్లు చాలా వేగంగా పెరిగాయి. అప్పట్లో మార్కెట్లు ఏడాదికి 24 శాతం రాబడిని అందించాయి. ఆ క్రమంలో లాభాల వాంఛతో అతడు అధిక మెుత్తంలో పెట్టుబడులను పెట్టాడు. తనకు పెట్టుబడులపై అవగాహన లేదని, మార్కెట్ ఎలా పనిచేస్తుందో తనకు తెలియదని మార్కెట్ క్రాష్ తర్వాత అతడు గుర్తించాడు.

కంపెనీ ఏర్పాటు నిర్ణయం..
నష్టాలతో మార్కెట్ల నుంచి పారిపోకుండా.. వాటి పనితీరును తెలుసుకుని నష్టాలను పూడ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కరెక్ట్ ఎంట్రీ, ఎగ్జిట్ వంటి టెక్నికల్ అంశాలు చదువుకున్నవారికి సైతం అర్థం చేసుకోవటం కష్టంగా ఉండేవి. అలా ఈ ప్రయాణంలో అంశాల ఆధారంగా స్టాక్‌గ్రో కంపెనీని ఏర్పాటు చేశాడు.

పర్సనల్ ఫైనాన్స్..
సహజంగా చాలా మంది తమ ఆదాయంలో 10 నుంచి 20 శాతం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ తర్వాత మిగిలిన మెుత్తాన్ని ఖర్చు చేస్తుంటారు. అయితే దీర్ధకాలంలో వీటి నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కెరీర్ ప్రారంభంలోనే ఇన్వెస్ట్ చేయటం ప్రారంభించాలని అతడు సూచిస్తారు. పైగా ఆ సమయంలో రిస్క్ తీసుకునే సామర్థ్యం ఎక్కువ, ఖర్చులు తక్కువగా ఉంటాయని ఆయన చెబుతున్నారు.

అదాయాన్ని ఎలా వినియోగించాలి..
సంపాదనను ఎలా వినియోగించాలనే దాని విషయంలో లఖోటియా ఒక ఫార్ములాను చెబుతున్నారు. అదేటంటే మెుత్తం ఆదాయంలో 50% నెలవారీ ఖర్చులకు, 20% ఫిక్స్ డ్ డిపాజిట్ సేవింగ్స్ చేయాలని మిగిలిన 30 శాతాన్ని స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడిగా ఉంచాలని సూచిస్తున్నారు. 2020లో ప్రారంభించబడిన స్టాక్‌గ్రో స్టార్టప్ కంపెనీ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. కంపెనీ ప్రస్తుతం నెలకు రెండింతల వృద్ధితో ముందుకు సాగుతోంది. రెండేళ్ల కాలంలో 2 కోట్ల యాప్ డౌన్‌లోడ్‌లను దాటింది. ప్రస్తుతం కంపెనీ మిలీనియల్స్ ఇన్వెస్టర్లపై దృష్టి సారిస్తోంది.