Stock Markets Today:ప్రారంభ దశలో రంకెలేసిన బుల్: ఆ తర్వాత ఫ్లాట్‌గా..!
ప్రపంచ మార్కెట్లు దృఢంగా ఉన్నాయి. కేంద్రం బడ్జెట్ ప్రకటించిన నాటి నుంచే స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ ప్రవేశ పెట్టి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ మార్కెట్లు లాభాలలోనే కొనసాగుతుండటం విశేషం. బుధవారం సూచీలు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. తొలిసారిగా గరిష్ట స్థాయిని తాకిన సూచీలు ఆ తర్వాత తిరిగి పడిపోయాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 50,231 పాయింట్ల వద్ద ట్రేడ్ కాగా నిఫ్టీ 14754.9 వద్ద ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ దాదాపు 10శాతం లాభపడగా ఆ తర్వాత బలహీనపడింది.
ఇక ఈ రోజు ప్రారంభ దశలో జరిగిన ట్రేడింగ్‌లో టాటా మోటార్స్, ఐఓసీ, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, ఓఎన్‌జీసీలు లాభాల బాట పట్టగా... ఎస్‌బీఐ, కొటాక్ మహీంద్ర, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, హెడీఎఫ్‌సీలు నష్టాలు చవిచూశాయి. ఇదిలా ఉంటే బ్రుక్‌ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఇవాళ (బుధవారం)రూ.3800 కోట్లు మేరా ఐపీఓల ద్వారా సేకరించనుంది. ఒక్క షేర్ విలువ రూ.274 నుంచి రూ.275 మధ్య ఉండనుంది. మరోవైపు హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కూడా మార్కెట్‌లోకి అరంగేట్రం చేయనుంది.

ఇక భారతీ ఎయిర్‌టెల్‌కు సంబంధించిన షేర్లపై కూడా ప్రధాన ఫోకస్ ఉండనుంది. ఈ రోజు ఆ సంస్థ సాధిచిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. రెవిన్యూ కోణంలో భారతీ ఎయిర్‌టెల్ లాభాల బాట పడుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చివరిసారిగా 0.6శాతం లాభాలను ఎయిర్‌టెల్ చూపించింది. ఇదిలా ఉంటే ఏషియన్ సూచీలు కూడా లాభాల బాట పడ్డాయి. ఇక జపాన్ నిక్కీ మరియు సింగపూర్ స్ట్రెయిట్స్ టైమ్‌లు కూడా లాభాలు చూపించాయి.