కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం ఇళ్ల వద్దే ఉంటూ పనిచేసేందుకు అనుమతి ఇస్తున్న ఐటీ సంస్దలు ఇదే అదనుగా ఉద్యోగులను వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది కుదరకపోతే కనీసం వేతనాల్లో కోతలకు సైతం సిద్దమవుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ఓ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఉద్యోగుల వాదనను తిరస్కరించింది.

ఐటీ ఉద్యోగులకు సుప్రీం షాక్
ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుని ఐటీ ఉద్యోగులను తొలగించకుండా, వారి జీతాల్లో కోత విధించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగుల తొలగింపు, జీతాల కోత వద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. అయితే పిటిషన్ విచారించిన సుప్రీం ధర్మాసనం.. పిటిషనర్ల వాదన రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కు అనుగుణంగా లేదని పేర్కొంటూ తిరస్కరించింది.

ఆర్టికల్ 32 ఏం చెబుతోంది ?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం దేశంలో ఎవరైనా తన ప్రాధమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాటిని పరిరక్షించుకోవడం కోసం హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని చెబుతోంది. కానీ పిటిషన్ దాఖలు చేసిన ప్రైవేటు ఉద్యోగులు ఆర్టికల్ 14, 19,21 ప్రకారం ప్రైవేటు సంస్ధలు తమ ఉద్యోగాలకు భరోసా ఇవ్వాలని కోరుతూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. దీంతో పిటిషనర్ల వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు.

ప్రభుత్వాల సూచనలూ బేఖాతర్
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావాన్ని కారణంగా చూపుతూ ప్రైవేటు సంస్ధలు తమ ఉద్యోగులను తొలగించవద్దని, వేతనాల్లో కోతలు విధించవద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే ఈ సూచనకు చట్టపరంగా రక్షణ లేకపోవడంతో ఆయా సంస్ధలు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఇదే అంశాన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది.

ఐటీ సంస్ధల్లో కోతలే కోతలు..
ఒకప్పుడు ఐటీ ఉద్యోగాలంటే యువత ఎగబడే పరిస్ధితి ఉండేది. కానీ కరోనా సంక్షోభం ఆ వాదనలో పస లేదని నిరూపిస్తోంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో టెక్ మహీంద్రా, కేపీ ఐటీ సొల్యూషన్స్, కాగ్నిజెంట్, ఇన్పోసిస్ వంటి దిగ్గజాలు సైతం తమ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీరిలో కొందరు ఇప్పటికే షిప్ట్ అలవెన్సులు రద్దు చేయగా, మరికొందరు కొత్తగా తీసుకోవాల్సిన ఉద్యోగులకు జాయినింగ్ తేదీలను వాయిదా వేసేస్తున్నాయి. ఎయిర్ లైన్స్, టూరిజం రంగానికి సేవలందిస్తున్న ఫేర్ పోర్టల్ అనే ఐటీ సంస్ధ ఏకంగా 300 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది.


Click it and Unblock the Notifications