Good News: ఉద్యోగాల తొలగింతనే కాదు.. కరోనా తర్వాత ఈ రంగాల్లో కొత్త అవకాశాలు
కరోనా మహమ్మారి కారణంగా వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందనే విషయం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా విమాయానం, పర్యాటకం, రెస్టారెంట్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత లేదా వేతన కోత ఉంటుందని చెబుతున్నారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో గత దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగ సహకారం కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. మన దేశంలోను కరోనా, లాక్ డౌన్ ప్రభావం ఆందోళన కలిగిస్తోంది.

పడిపోయిన ఉత్పత్తి, డిమాండ్
కరోనా కారణంగా ఇప్పటికే ప్రపంచం స్తంభించి, ఉత్పత్తి, డిమాండ్ పడిపోయి ఉద్యోగాలు ఊడిపోడం లేదా శాలరీ కట్ పరిస్థితులు కళ్లెదురుగా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చిన్నాభిన్నమయ్యాయి. లాక్ డౌన్ అనుకున్న సమయానికి ఎత్తివేస్తే ఈ అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు కోలుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు. కనీసం ఆరు నెలల నుండి ఏడాది పడుతుందని లెక్కలు వేస్తున్నారు.

కొత్త ఉద్యోగాలు..
ఇలాంటి పరిస్థితుల్లోను మున్ముందు కొన్ని రంగాలు లేదా వ్యాపారాలకు మరింత మంచి రోజులు రానున్నాయని అంటున్నారు. కొన్ని వ్యాపారాల్లో త్వరలో జాబ్ మార్కెట్ పుంజుకుంటుందని, అనేక కొత్త రంగాలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫార్మా వంటి రంగాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు.

ఈ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు
కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకొనే క్రమంలో గేమింగ్, ఓటీటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ వర్చువల్ టీమ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్టువేర్, ఈ-కామర్స్, విద్యాసాంకేతిక రంగాలు స్థిరంగా అభివృద్ధి చెందుతాయని వివిధ కంపెనీల మానవ వనరుల విభాగాలు భావిస్తున్నాయి. ఈ రంగాల్లో భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంటున్నారు.

ఉద్యోగాల తొలగింతతో పాటు.. కొత్త దారి
వర్చువల్ మెడికల్ టూరిజం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. కరోనా అనంతరం దీనికి మరింత డిమాండ్ రానుందని చెబుతున్నారు. సేవలు, హెల్త్ సెక్టార్‌లు బాగా పురోగతి సాధిస్తాయని, ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. డెలివరీ రంగం కూడా భారీగా పుంజుకోనుందని చెబుతున్నారు. మొత్తానికి కరోనా ఉద్యోగాలను తొలగించడంతో పాటు కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కూడా దారి చూపించిందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications