iPhone plant clashes: విస్ట్రాన్ నష్టం రూ.437 కోట్లు కాదు, రూ.52 కోట్లు
కర్ణాటకలో కోలార్ జిల్లాలోని విస్ట్రాన్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌పై శనివారం జరిగిన దాటిలో రూ.437 కోట్ల భారీ ఆస్తి నష్టం జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ నష్టం రూ.52 కోట్లు మాత్రమేనని తాజాగా తెలుస్తోంది. తైవాన్‌కు చెందిన ఈ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ ఆపిల్ ఐఫోన్లు తయారు చేస్తుంది. ఇతర ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. శనివారం నాటి ఘటనలో రూ.52 కోట్ల మేర నష్టం జరిగినట్లు తైవాన్ స్టాక్ ఎక్స్చేంజీకి సమాచారం ఇచ్చింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 100 నుండి 200 మిలియన్ల తైవాన్ డాలర్ల మేర (భారత కరెన్సీ ప్రకారం రూ.52 కోట్లు) నష్టం జరిగింది. ఈ వయోలెన్స్ వల్ల ప్రధానమైన మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్‌మెంట్స్, వేర్‌హౌస్‌లలో నష్టం జరగలేదని తెలిపింది.

మొదట ఎక్కువ నష్టం అంచనా
విస్ట్రాన్ సోమవారం కోలార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని, నష్టం రూ.437 కోట్లుగా ఉందని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కంపెనీ మొదట నష్టాన్ని ఎక్కువగా అంచనా వేసిందా తెలియాల్సి ఉంది. లేదంటే పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైలింగ్ సమయంలో మిస్-కమ్యూనికేషన్ వల్ల ఎక్కువగా వేశారా తెలియాల్సి ఉంది. స్టాక్ ఎక్స్చేంజీకి సమాచారం ఇచ్చామని, అంతకుమించి చెప్పడానికి ఏం లేదని విస్ట్రాన్ ఇండియా ఎండీ సుదీప్తో గుప్తా అన్నారు.

అందుకే దాడి జరిగిందని..
విస్ట్రాన్ ఐఫోన్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌పై డిసెంబర్ 12, శనివారం దాడి జరిగింది. దీంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దాడితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్నవారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వాహనాలు, కంప్యూటర్, ల్యాప్‌టాప్స్ ధ్వంసం చేశారు. పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం ఈ దాడి జరిగిందని తెలిపారు. వేతనాలకు సంబంధించిన సమస్యతో ఈ దాడి జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ప్లాంటులో మొత్తం 7వేల నుండి 8వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. రెండు షిఫ్టులు ఉన్నాయి.

చర్చలు.. దాడి
విస్ట్రాన్ ప్లాంట్‌లోని ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. ఎన్నిసార్లు యాజమాన్యంతో మాట్లాడిన లాభం లేకపోయిందట. శనివారం ఉద్యోగులు ప్లాంట్ ముందు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులు ఉద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఉద్యోగులు కర్రలు, రాడ్లతో ప్లాంట్‌ను ధ్వంసం చేశారు. కంపెనీ వాహనాలకు నిప్పు పెట్టారు.


Click it and Unblock the Notifications