అమెరికా ఎఫెక్ట్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: 51,000 దిగువకు సెన్సెక్స్
ముంబై: నిన్న భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు, నేడు అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి వెళ్లాయి. ప్రారంభంలోనే దాదాపు 650 పాయింట్ల మేర నష్టంతో ప్రారంభమైంది సెన్సెక్స్. ఆ తర్వాత అతి స్వల్పంగా మాత్రమే కోలుకుంది. ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు మినహా అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. భారత్ విక్స్ సూచీ దాదాపు 5 శాతానికి పైగా పెరిగింది. ఇది మార్కెట్లో భయాలను పెంచింది. నిన్న అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. ప్రధానంగా టెక్నాలజీ షేర్ల విక్రయాలు, జాబ్ డేటా నిరాశాజనకంగా ఉండటంతో సూచీలు పతనమయ్యాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్ పైన పడింది.

సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్
నిన్న 51,445 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 640 పాయింట్ల మేర నష్టపోయి 50,812 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 50,957.29 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,539.92 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,026.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,101.05 వద్ద గరిష్టాన్ని, 14,980.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. అంటే నిఫ్టీ ఓ సమయంలో 15,000 పాయింట్ల దిగువకు వచ్చింది. మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ 604 పాయింట్లు నష్టపోయి 50,840 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయి 15,076 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో UPL 2.63 శాతం, అదానీ పోర్ట్స్ 2.35 శాతం, SBI లైఫ్ ఇన్సురా 1.29 శాతం, గ్రాసీమ్ 0.90 శాతం, టైటాన్ కంపెనీ 0.75 శాతం నష్టపోయాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC 2.80 శాతం, JSW స్టీల్ 2.95 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.59 శాతం, HDFC బ్యాంకు 2.55 శాతం, టాటా స్టీల్ 2.50 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, రిలయన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు 1.43 శాతం క్షీణించి రూ.2170 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 సూచీ 0.73 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.40 శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో 0.16 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.11 శాతం, నిఫ్టీ ఐటీ 0.34 శాతం, నిఫ్టీ మీడియా 2.02 శాతం, నిఫ్టీ ఫార్మా 0.33 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.22 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 1.54 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.18 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.56 శాతం, నిఫ్టీ మెటల్ 1.60 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.27 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.35 శాతం నష్టపోయాయి.