Stock Market: మార్కెట్లు నష్టాల ప్రారంభం.. సూచీలకు అమెరికా ద్రవ్యోల్బణం దెబ్బ..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ విడుదల కానున్న నేపథ్యంలో భయాలు పెరిగాయి. ఇది అమెరికాలోని రిటైల్ ప్రజలు వినియోగించే వస్తుసేవల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తుంది. దీనికి తోడు క్రిప్టో కరెన్సీలపై అక్కడ ఇన్వెస్టర్లలో ఉన్న ఆందోళనలను మరింత పెంచుతోంది. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా పడుతోంది.

వేచి ఉన్న బంగారం..
అమెరికా ద్రవ్యోల్బణం వివరాలు వెలువడటం కోసం గోల్డ్ ఇన్వెస్టర్లు వేచి చూస్తున్న తరుణంలో బంగారం ధర కూడా ప్రభావితం కానుంది. చైనాలో కొనసాగుతున్న కరోనా లాక్ డౌన్ల కారణంగా క్రూడ్ ధరలు సైతం వరుసగా నాలుగో రోజు తగ్గాయి. అయితే తగ్గిన ధరల ప్రయోజనం సామాన్యులకు మాత్రం అందటం లేదు.

సూచీల పరిస్థితి..
ఉదయం 9.40 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 470 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 130 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 246 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 133 పాయింట్లను కోల్పోయింది. మార్కెట్లు ప్రారంభమైన సమయంలో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, లుపిన్ షేర్లు ఫోకస్ లో ఉన్నాయి.

టాప్ గెయినర్స్..
NSEలో సిప్లా, దివీస్ ల్యాబ్, హీరో మోటొకార్ప్, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, యూపీఎల్, హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు లాభపడి టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే క్రమంలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, మారుతీ, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొసాగుతూ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.