భారత ఎగుమతులు డౌన్, భారీగా తగ్గిన వాణిజ్యలోటు: 7నెలల్లో మార్పులు ఇలా...
భారత్‌లో ఎగుమతులు భారీగా క్షీణించాయి. సెప్టెంబర్ నెలలో సానుకూల వృద్ధిని నమోదు చేసిన భారత ఎగుమతులు, అక్టోబర్ మాసంలో 5.4 శాతం మేర పడిపోయి 24.82 బిలియన్ డాలర్లకు (2,482 కోట్ల డాలర్లు) పరిమితమైంది. ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులు, జెమ్స్ అండ్ జ్యువెల్లరీ, లెదర్, ఇంజినీరింగ్ ఉత్పత్తుల షిప్‌మెంట్ క్షీణించింది. ఆర్థిక లోటు 8.78 బిలియన్ డాలర్లుగా (878 కోట్ల డాలర్లు) ఉంది. దిగుమతులు కూడా 11.56 శాతం క్షీణించాయి.

తగ్గిన వాణిజ్య లోటు
కరోనా నేపథ్యంలో వరుసగా ఆరు నెలల పాటు దేశీయ ఎగుమతులు తగ్గాయి. సెప్టెంబర్‌లో 5.99 శాతం పెరిగాయి. కానీ తిరిగి అక్టోబర్ మాసంలో 5.4 శాతం పడిపోయాయి. ఈ ఏఢాది అక్టోబర్ నెలలో ఎగుమతులు 2,482 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. 2019 అక్టోబర్ నెలలో 2,623 కోట్ల డాలర్లు కావడం గమనార్హం. గత నెలలో దిగుమతులు కూడా 11.56 శాతం క్షీణించి 3,360 కోట్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో భారత వాణిజ్య లోటు 878 కోట్ల డాలర్లుగా నమోదయింది. 2019లో అక్టోబర్ నెలలో నమోదయిన 1,176 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు 25.34 శాతం తగ్గినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ ఉత్పత్తులు డౌన్, ఇవి అప్
అక్టోబర్ నెలలో పెట్రోలియం ఉత్పత్తులు 53.30 శాతం, కాజు 21.57 శాతం, జెమ్స్ అండ్ జ్యువెల్లరీ 21.27 శాతం, లెదర్ 16.69 శాతం, మ్యాన్ మేడ్ యార్న్/ఫ్యాబ్రిక్స్/మేడప్స్ 12.82 శాతం, ఎలక్ట్రానిక్ గూడ్స్ 9.40 శాతం, కాఫీ 9.25 శాతం, మెరైన్ ఉత్పత్తులు 8.09 శాతం, ఇంజినీరింగ్ గూడ్స్ 3.84 శాతం మేర క్షీణించాయి. అదే సమయంలో బియ్యం, ఆయిల్ మీల్స్, ఐరన్ ఓర్, ఆయిల్ సీడ్స్, కార్పెట్, ఫార్మాస్యూటికల్స్, స్పైసెస్, కాటన్, కెమికల్స్ వంటి ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం పెరిగాయి.

ఎగుమతులు 19 శాతం, దిగుమతులు 36 శాతం డౌన్
ఏప్రిల్-అక్టోబర్ కాలంలో ఎగుమతులు 19.05 శాతం క్షీణించి 150.07 బిలియన్ డాలర్లుగా నమోదయింది. దిగుమతులు 36.28 శాతం తగ్గి 182.29 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్టోబర్ నెలలో చమురు దిగుమతులు 38.52 శాతం పతనమై 5.98 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏప్రిల్-అక్టోబర్ చమురు దిగుమతులు 49.5 శాతం పడిపోయి 37.84 బిలియన్ డాలర్లుగా ఉంది.


Click it and Unblock the Notifications