కరోనా వైరస్ పుట్టిన చైనా నుండి విదేశీ కంపెనీలు బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. చైనాలోని వేలాది అమెరికా కంపెనీలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. అదే సమయంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా పైన ఎక్కువగా ఆధారపడవద్దని భారత్ భావిస్తోంది. దాదాపు అన్ని దేశాలు ఇలాగే ఆలోచిస్తున్నాయి. చైనాలోని తమ దేశ కంపెనీలను తరలించేందుకు జపాన్ 2.2 బిలియన్ డాలర్లు ప్రకటించింది. భారత్ కూడా చైనా నుండి వచ్చే విదేశీ కంపెనీల కోసం భూమిని సమీకరించడం, త్వరితగతిన అనుమతులు వంటి అంశాలపై పని చేస్తోంది.

వెయ్యి కంపెనీలతో చర్చలు
అమెరికా-చైనా ట్రేడ్ వార్ సమయంలో మనకు అంతగా ప్రయోజనం కలగలేదు. ఇప్పుడు కరోనా కారణంగా చైనాను వదిలి వెళ్లాలనుకుంటున్న కంపెనీలను ఆకర్షించే పనిలో పడింది మోడీ ప్రభుత్వం. కొన్నింటికి ఇప్పటికే భారత్‌లో ఉనికి ఉంది. అలాంటి వారు పూర్తిగా చైనా నుండి ఇక్కడకు తరలి వచ్చే అవకాశాలు ఉంటాయి. గత నెలలోనే వెయ్యికి పైగా అమెరికా కంపెనీలను దైత్య అధికారుల ద్వారా భారత్ సంప్రదించింది. అక్కడి నుంచి వచ్చే కంపెనీలకు భారీ ఎత్తున ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇస్తామని భారత్ చెబుతోంది. పన్నులు, కార్మిక చట్టాలు, భూసేకరణ నిబంధనలను మరింత సులభతరం చేయనుంది.

మార్పులు..
అమెరికా, జపాన్, ఐరోపా దేశాల్లో తయారీ పరిశ్రమలను నెలకొల్పడం ఖర్చుతో కూడుకున్న పని. మన దేశంలో వేతనాలు తక్కువ. కార్మికులు దొరుకుతారు. కానీ చైనాతో పోలిస్తే ఖర్చు కాస్త ఎక్కువ. కానీ చాలా దేశాలతో పోలిస్తే తక్కువ. ఇప్పుడు చైనా నుండి వచ్చే కంపెనీల కోసం పన్నులు, చట్టాల్లో మార్పులు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. జీడీపీలో 15 శాతంగా ఉన్న తయారీ రంగం వాటాను 2022 నాటికి 25 శాతానికి పెంచాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.

300 కంపెనీలు సిద్ధం
సంప్రదింపులు జరిపిన వెయ్యి కంపెనీల్లో 300 వరకు ఇప్పటికే తమ ప్లాంట్స్‌ను ఇండియాలో ఏర్పాటు చేసేందుకు దాదాపు మొగ్గు చూపుతున్నాయని తెలుస్తోంది. ఇందులో మొబైల్, టెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్ సంస్థలు ఉన్నాయి. అమెరికా కంపెనీలతో పాటు ఇతర దేశాల సంస్థలు కూడా భారత్‌ను ఎంచుకుంటున్నాయి. గత సెప్టెంబర్ నెలలో కార్పోరేట్ పన్నును మోడీ ప్రభుత్వం 25 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా విదేశీ కంపెనీలు రావడానికి కలిసి వస్తోంది. కొత్త తయారీ సంస్థలపై పన్నును 17 శాతం మాత్రమే విధిస్తున్నట్లు కూడా ప్రకటన చేసింది మోడీ ప్రభుత్వం.


Click it and Unblock the Notifications