జనవరి 1 నుండి ఓకే...: తగ్గుతోన్న ఉల్లి ధరలు, కేంద్రం కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొద్దినెలల క్రితం భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. సరఫరా చైన్‌లోను ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఉల్లి ధరలు రూ.200 మార్కును కూడా చేరుకున్నాయి. కేంద్రం వెంటనే చర్యలు చేపట్టి, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో పాటు వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంది. దీంతో ఉల్లి ధరలు క్రమంగా కిందకు దిగి వచ్చాయి. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.25 నుండి రూ.35 మధ్య ఉంది. ఈసారి పంట రావడం, దిగుమతులు ఉండటంతో ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

2021 జనవరి 1 నుండి నిషేధం ఎత్తివేత
ఉల్లి ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది. 2021 జనవరి 1వ తేదీ నుండి అన్ని రకాల ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపింది.
ఉల్లి ధరలను అదుపు చేసేందుకు విదేశాలకు ఉల్లి విత్తనాల ఎగుమతిని తక్షణమే నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ (DGFT) సెప్టెంబర్ 15వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. హోల్‌సేలర్ల వద్ద 25 టన్నులు, రిటైలర్ల వద్ద 2 టన్నులకు మించి ఉల్లి నిల్వలు ఉండరాదని ఇది వరకే కేంద్రం ఆంక్షలు విధించింది.

ఎగుమతికి పచ్చజెండా
'01.02.2021 నుండి అన్ని రకాల ఉల్లి ఎగుమతి చేసుకోవచ్చు' అని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఏప్రిల్-జూలై కాలంలో ఉల్లి ఎగుమతులు 30 శాతం పెరిగాయి. ఆ తర్వాత వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయింది. దీంతో ధరలు పెరిగాయి. అధికారిక డేటా ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి 328 మిలియన్ డాలర్ల ఫ్రెష్ ఉల్లి, 112 మిలియన్ డాలర్ల డ్రైడ్ ఉల్లి ఎగుమతులు జరిగాయి. ఏప్రిల్-జూలై 2020లో బంగ్లాదేశ్‌కే ఎగుమతులు 157.7 శాతం పెరిగాయి.

అప్పుడు కూడా నిషేధం
2019 సెప్టెంబర్ నెలలోను కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఆ సమయంలో పంట సరిగా రాకపోవడంతో ధరలు కిలో రూ.80కి చేరుకున్నాయి. ఆ తర్వాత మార్చి 15, 2020న నిషేధాన్ని ఎత్తివేసింది. అనంతరం కరోనా కారణంగా సెప్టెంబర్‌లో మరోసారి నిషేధం విధించింది. కాగా, బెంగళూరు రోజ్ ఉల్లి కృష్ణాపురం ఉల్లిని ఎగుమతి చేసుకునేందుకు కేంద్రం అక్టోబర్ 9నే అనుమతి ఇచ్చింది. ఒక్కో రకం 10,000 మెట్రిక్ టన్నుల చొప్పున వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఎగుమతి చేసుకోవచ్చునన, చెన్నై పోర్ట్ ద్వారా ఎగుమతి చేసుకోవాలని షరతు విధించింది.


Click it and Unblock the Notifications