ఐటీ పోర్టల్‌లో సమస్య: పన్ను చెల్లింపులకు గడువు పొడిగింపు
ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్‌లో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈక్వలైజేషన్ లెవీ స్టేట్‌మెంట్ (ఫామ్ -1), వివాద్ సే విశ్వాస్ తదితర గడువులను పొడిగించింది. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల రిటర్న్స్‌తో పాటు జీఎస్టీ రిటర్న్స్‌కు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. వివాద్ సే విశ్వాస్ పథకం చెల్లింపుల గడువు ఈ నెలాఖరు వరకు ఉండగా, సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది. ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది.
ఈ పథకం ద్వారా ఏదైనా ఒక అసెస్‌మెంట్ లేదా రీ-అసెస్‌మెంట్ ఆర్డర్ కింద చెల్లించాల్సిన వివాదాస్పద పన్ను మొత్తాన్ని అంటే వంద శాతం, వడ్డీ లేదా పెనాల్టీలో 25 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అయితే దీనికి సంబంధించి ఈ సంవత్సరం మార్చిలోగా ప్రత్యేక ఫామ్‌లో దరఖాస్తు చేసి ఉండాలి. వివాదంలో ఉన్న పన్ను, 25 శాతం వడ్డీ లేదా పెనాల్టీతో పాటు ఈ బకాయిలపై వడ్డీ కూడా చెల్లించేందుకు సిద్ధమైతే ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు చెల్లింపులు చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా ప్రారంభించిన ఈ-ఫైలింగ్ పోర్టలో తలెత్తిన సాంకేతిక సమస్యలు, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకం వివాద్ సే విశ్వాస్ చెల్లింపుల గడువును సెప్టెంబర్ 30 వరకు CBDT పొడిగించింది. పెన్షన్ నిధులు, సావరీన్ ఫండ్ నిధులు దేశీయంగా పెట్టే పెట్టుబడుల వివరాలు తెలిపే ఎలక్ట్రానిక్ గడువును కూడా పెంచింది. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాలకు సంబంధించిన వివరాలను నవంబర్ 30, డిసెంబర్ 31వ తేదీ లోపు ఈ-ఫైలింగ్ చేయాలని పేర్కొంది. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాలకు సంబంధించి ఫామ్ 15జీ/15హెచ్‌లను కూడా వరుసగా నవంబర్ 30, డిసెంబర్ 31లోపు సమర్పించాలని తెలిపింది. జీఎస్టీ ఆమ్నెస్టీ పథకాన్ని పొందడానికి చివరి తేదీని ఆర్థిక శాఖ మూడు నెలలు పొడిగించింది.


Click it and Unblock the Notifications