స్టాక్ మార్కెట్, ఆర్బీఐ పాలసీపై ఫెడ్ వడ్డీ రేటు పెంపు ప్రభావం
యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచింది. 2018 డిసెంబర్ తర్వాత అంటే మూడేళ్ళ అనంతరం ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఫెడ్ వడ్డీ రేటు పెంపు ప్రభావం జాతీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ పైన, ఉంటుంది. ఇప్పటికే ఫెడ్ వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్ల మేర పెరగవచ్చునని మొదటి నుండి అంచనాలు ఉన్నాయి. అయితే అందరి అంచనాల కంటే తక్కువగా 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇది మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది.
వడ్డీ రేటు పెంపు కచ్చితంగా ఉంటుందని మార్కెట్ ముందే అంచనాకు రావడం, అది కూడా 25 బేసిస్ పాయింట్లు మాత్రమే పెరగడంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పరుగు పెట్టింది. ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాల పైన, మార్కెట్ పైన ప్రభావం చూపుతుంది.

వడ్డీ రేట్ల పెంపు
2018 డిసెంబర్ తర్వాత మొదటిసారి తాజాగా వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్భణం 4 దశాబ్దాల రికార్డ్ స్థాయికి చేరుకోవడంతో దీనిని అధిగమించే చర్యల్లో భాగంగా ఫెడ్ రిజర్వ్ ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత క్యాలెండర్ ఏడాది చివరి నాటికి వడ్డీ రేటు 1.75 శాతం నుండి 2 శాతం మధ్యకు చేరుకోవచ్చు. అమెరికా బలమైన ఆర్థిక వ్యవస్థ అని, ప్రస్తుత పరిస్థితిని తట్టుకోగలదని చెప్పలేమని, ఈ నేపథ్యంలో ద్రవ్య విధానం కచ్చితంగా సానుకూలంగా ఉంటుందని జెరోమ్ పోవెల్ అన్నారు.

స్టాక్ మార్కెట్‌పై ప్రభావం
ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం అనంతరం ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. అమెరికా మార్కెట్లు రెండు శాతం మేర లాభపడ్డాయి. భారత మార్కెట్లు గురువారం దాదాపు రెండు శాతం మేర ఎగిశాయి. మరోవైపు, క్రూడ్ ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్ చమురు దీపావళితో పోలిస్తే దాదాపు 30 డాలర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇటీవలి గరిష్టాలతో తగ్గింది. ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం ప్రభావం భారత, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ పైన కనిపిస్తోంది.

ఆర్బీఐపై ప్రభావం
ఫెడ్ వడ్డీ రేటు పెంపు, దేశీయ రిటైల్ ద్రవ్యోల్భణం పెరగడంతో ఏప్రిల్ 6 నుండి 8 మధ్య జరిగే తదుపరి ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంపై ఈ ప్రభావం ఉంటుంది. అమెరికా ఫెడ్ వలె కాకుండా ఆర్బీఐ అనుకూల వైఖరిని కొనసాగించే అవకాశం ఉండవచ్చు. ఇందుకు భారత్ రిటైల్ ద్రవ్యోల్భణం ఆర్బీఐ నిర్దేశిత లక్ష్య పరిధిలోనే ఉండటమే కారణం. ఇటీవల ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్భణం ఎనిమిది నెలల గరిష్టం 6.07 శాతానికి పెరిగింది.