ఎగుమతులు డౌన్, 10 నెలల గరిష్టానికి వాణిజ్యలోటు: బంగారం ఎఫెక్ట్.. దిగుమతులు జంప్
న్యూఢిల్లీ: భారత్ నుండి ఎగుమతులు నవంబర్ నెలలో 8.74 శాతం పడిపోయినట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పెట్రోలియం, ఇంజినీరింగ్, రసాయనాలు, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు క్షీణించడంతో 23.52 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది. అదే సమయంలో దిగుమతులు కూడా 33.39 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దీంతో వాణిజ్య లోటు 9.87 బిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ నుండి ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం పడిన విషయం తెలిసిందే.

ఎగుమతులు ఏవి ఎంత తగ్గాయంటే
నవంబర్ నెలలో ఎగుమతులు ఎనిమిది శాతానికి పైగా తగ్గడంతో 23.52 బిలియన్ డాలర్లు లేదా రూ.1.76 లక్షల కోట్లకు పరిమితమైంది. 2019 నవంబర్ నెలలో 25.77 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు ఎగుమతులు 59.73 శాతం, లెదర్ గూడ్స్ 29.80 శాతం, మ్యాన్ మేడ్ ఫ్యాబ్రిక్స్ 11.06 శాతం, ఇంజినీరింగ్ గూడ్స్ 8.12 శాతం, ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ 8.06 శాతం క్షీణించాయి.

వాణిజ్య లోటు
ఇక నవంబర్ నెలలో దిగుమతులు రూ.73,000 కోట్లుగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన దిగుమతులు 13.32 శాతం క్షీణించి 33.39 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. వాణిజ్య లోటు 9.87 బిలియన్ డాలర్లకు క్షీణించింది. గత ఏడాది నవంబర్ నెలలో 12.75 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే అక్టోబర్ నెలలో 8.78 బిలియన్ డాలర్లుగా నమోదయిన వాణిజ్య లోటు వరుసగా రెండో నెల (నవంబర్ 9.87 బిలియన్ డాలర్లు)లో పెరిగింది. వాణిజ్య లోటు నవంబర్ నెలలో పది నెలల గరిష్టానికి చేరింది.

దిగుమతులు అప్
సెప్టెంబర్ త్రైమాసికం కంటే డిసెంబర్ త్రైమాసికంలో మర్చంటైజ్డ్ ట్రేడ్ డెఫిసిట్ రెండింతలు పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది. ఆర్థికవ్యవస్థ రికవరీ కారణంగా దిగుమతులు పెరుగుతున్నాయని పేర్కొంది. పండుగ సమయంలో బంగారానికి కూడా డిమాండ్ వచ్చిందని, ఈ దిగుమతులు పెరిగినట్లు చెబుతోంది. పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలయాలు తోడైనట్లు వెల్లడించింది. పండుగలు, పెళ్లిళ్లు, ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరగడం వంటి వాటి కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో దిగుమతులు పెరుగుతాయని తెలిపింది.


Click it and Unblock the Notifications