భారత్ ఎగుమతులు భారీగా జంప్, 45 శాతం పెరగడానికి కారణం ఏమంటే
భారత మర్చంటైజ్డ్ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన ఆగస్ట్ నెలలో 45.17 శాతం ఎగబాకి 33.14 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే ఇది కేవలం ఎగుమతుల బూస్ట్ మాత్రమే కాదు, గత ఏడాది కరోనా నేపథ్యంలో లోబేస్ కారణంగా కూడా ఈ వృద్ధి నమోదయింది. అదే సమయంలో కరోనా ముందు 2019 ఆగస్ట్ నెలతో పోలిస్తే మాత్రం 27.5 శాతం (25.99 నుండి 33.14 బిలియన్ డాలర్లకు) ఎగబాకాయి. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నివేదిక వెల్లడిస్తోంది.
ఏప్రిల్-ఆగస్ట్ కాలంలో దేశీయ మర్చంటైజ్డ్ ఎగుమతులు 163.67 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాది (2020) ఇదే కాలంతో పోలిస్తే 66.92 శాతం ఎక్కువ. అప్పుడు 98.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అప్పుడు కరోనా, లాక్ డౌన్ ఆంక్షల కారణంగా ఎగుమతులు పడిపోయాయి. ఇక కరోనా ముందు ఏడాది 2019 ఏప్రిల్-ఆగస్ట్‌తో పోలిస్తే 22.93 శాతం పెరిగాయి. అప్పుడు 133.14 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి.

ఎగుమతులు ఇలా జంప్
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఎగుమతులు భారీగా క్షీణించాయి. ఆ తర్వాత డిసెంబర్ నుండి క్రమంగా పెరగడం ప్రారంభమైంది. క్రమంగా పెరుగుతూ ఏప్రిల్ 2021 నాటికి ఎగుమతులు 193.63 శాతం పెరిగాయి. అంటే 2020 ఇదే ఏప్రిల్ నెలలో కరోనా, లాక్ డౌన్ కారణంగా ఎగుమతులు భారీగా పడిపోయాయి. అదే సమయంలో మర్చంటైజ్డ్ ఎగుమతులు కూడా ఆగస్ట్ నెలలో 51.47 శాతం పెరిగి 47.01 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2020 ఆగస్ట్ నెలలో ఇవి 31.03 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు 55.9 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
ఇక చమురు దిగుమతులు 80.38 శాతం పెరిగి 11.64 బిలియన్ డాలర్లకు, పసిడి దిగుమతులు 82.22శాతం పెరిగి 6.75 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇంజినీరింగ్ ఎగుమతులు 59 శాతం పెరిగి 9.63 బిలియన్ డాలర్లకు, పెట్రోలియం ఉత్పత్తులు 140 శాతం పెరిగి 4.55 బిలియన్ డాలర్లకు, రత్నాభరణాలు ఎగుమతులు 88 శాతం పెరిగి 3.43 బిలియన్ డాలర్లకు, , రసాయనాల ఎగుమతులు 35.75 శాతం పెరిగి 2.23 బిలియన్ డాలర్లకు చేరాయి.

సవాళ్లు పరిష్కరిస్తాం..
ఇదిల ఉండగా, తెలంగాణ నుండి ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) ఎగుమతుల్లో సవాళ్లపై హైదరాబాద్‌లోని కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా, ఆయన మాట్లాడారు.
ఎగుమతుల్లో ఎదురవుతోంన్న సవాళ్లు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇవ్వాల్సిందిగా పారిశ్రామికవేత్తలను కోరారు. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల ద్వారా తక్కువ సమయంలో పరిస్థితులు మళ్లీ యథాస్థితికి చేరుకున్నాయన్నారు. ఎగుమతిదారులు అభివృద్ధిలో భాగస్వాములు అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమన్నారు.

కంటైనర్ల అంశం
ఇటీవల కంటైనర్ల కొరత ఎగుమతి, దిగుమతిదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ అంశాన్ని పలువురు సోమేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. కంటైనర్ల కొరత ఎగుమతులకు ఆటంకంగా మారిందని చెప్పారు. జీఎస్టీ రీఫండ్ అంశంలో ఇబ్బందులు ఉన్నట్లు, దీనిపై కేంద్రంతో చర్చించాలని కోరారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఇంటర్నేషనల్ కొరియర్ కార్గో క్లియరెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరారు.


Click it and Unblock the Notifications