కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి సంస్థలు, ఉద్యోగులు భారీ నష్టాన్ని చవిచూశాయి. ఆదాయం లేక కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం, క్రమంగా సాధారణస్థితికి రావడం కంపెనీలకు, ఉద్యోగులకు ఊరట కలిగించే అంశం. అయితే లాక్ డౌన్ ముగిసిన తర్వాత కొన్ని రంగాల్లో డిమాండ్ ఊపందుకుంటే, మరికొన్ని రంగాలు కుదేలయ్యే ప్రమాదం ఉంది.

ఉద్యోగులను తొలగించక తప్పదు
వాహన విక్రయాలకు డిమాండ్ పుంజుకోకుంటే భారీ ఉద్యోగాల కోత తప్పకపోవచ్చునని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACMA) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అవసరానికి మించి సామర్థ్యం తయారీ యూనిట్లలో ఉందని, కానీ మున్ముందు డిమాండ్ లేకపోతే కార్మికులు, సిబ్బందిని తొలగించక తప్పదని తెలిపింది.

అదే జరిగితే ఇక ఆ ఉద్యోగులు అవసరం లేదు
ఆటో సేల్స్ లేక ఆర్థిక ఒత్తిడి ఉంటే వ్యాపారాన్ని నిలబెట్టుకునేందుకు కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాల్సిన తప్పని పరిస్థితులు ఎదురవుతాయని అక్మా పేర్కొంది. వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల తొలగింపు కూడా ఓ మార్గంగా ఉండవచ్చునని అక్మా అధ్యక్షుడు దీపక్ జైన్ అన్నారు. అయితే తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు మళ్లీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులు కూడా పని చేస్తున్నారని, సేల్స్ లేదా డిమాండ్ లేకుంటే వీరి అవసరం ఉండకపోవచ్చునని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల (పర్మినెంట్) కంటే కాంట్రాక్టు ఉద్యోగుల పైనే తొలుత ప్రభావం పడుతోందని గతంలోనే ఓ సర్వేలో వెల్లడైంది.

ఆ పరిస్థితి లేదు
ఆటో విడిభాగాల సంస్థల్లో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మందగమనం కారణంగా ఈ పరిశ్రమలో గతేడాది 18% కుంచించుకుపోయింది. ఈ ఏడాది 20 శాతం నుండి 40 శాతం క్షీణించవచ్చునని అంచనా. ఇప్పటికే ఆటో సేల్స్ లేవు. ఇప్పుడిప్పుడే వ్యవస్థలు తెరుచుకుంటున్నాయి. మరోవైపు కార్మికులు అదనంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకపోగా.. డిమాండ్ పడిపోతే ఉన్నవారిలో కొంతమందిని తొలగించే ప్రమాదం ఉంది. తిరిగి డిమాండ్ పుంజుకునే వరకు ఆర్థిక ఒత్తిడి, ఉద్యోగ నష్టాలు, ద్రవ్య నిర్వహణ గురించిన ఆందోళనలు ఉంటాయని చెబుతున్నారు.

ఉత్పత్తి, డిమాండ్ లేకుంటే
కరోనా కారణంగా 35 శాతం నుండి 40 శాతం వరకు సేల్స్ తగ్గిపోవచ్చునని ఆటో ఇండస్ట్రీ బాడీ సియామ్ (SIAM) అంచనా వేసింది. రెండేళ్ల పాటు ఇదే పరిస్థితి ఉంటే దాదాపు 50 శాతం తగ్గినా.. ఉత్పత్తి, డిమాండ్ లేకుంటే ఉద్యోగాలలో కోత తప్పదని దీపక్ జైన్ అన్నారు. ఇప్పటికే కంపెనీలకు అదనపు సామర్థ్యం ఉందని, ఇలాంటి సమయంలో ప్రస్తుత సామర్థ్యాన్ని లేదా ఉద్యోగాల విస్తరణ ఉండదన్నారు.


Click it and Unblock the Notifications