న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీ తమ కస్టమర్లకు మరింత వేగంగా మొబైల్స్‌ను చేరవేసేందుకు గ్యారెంటీ నెక్స్ట్ డే డెలివరీతో ముందుకు వచ్చింది. అంటే మరుసటి రోజే బుక్ చేసిన మొబైల్ మీ చేతిలో ఉంటుంది. ఇండియాలో షియోమీ తక్కువ ధరకు అధిక ఫీచర్లతో మొబైల్స్ అందిస్తూ యూజర్ల ఆదరాభిమానాలు అందుకుంటోంది. ఇప్పుడు కస్టమర్లకు మరింత చేరువవుతోంది.
చదవండి: రిలయన్స్ జియో 12 రకాల ఆఫర్లు, డేటా ప్యాకేజీ వివరాలు

ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలు
ఆన్‌లైన్‌లో మొబైళ్లతో పాటు ఇతర ఉత్పత్తులను ఆర్డర్ చేసిన మరుసటి రోజే వాటిని కస్టమర్లకు అందేలా ఈ ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలను ప్రారంభించింది. Mi.com వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసే వారికి ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల లోపు షియోమీ ఉత్పత్తులను ఆర్డర్ చేస్తే కస్టమర్లకు మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటల లోపు అందుతుంది. స్మార్ట్ ఫోన్లతో పాటు మరో 90 ఉత్పత్తులను అందిస్తోంది.

రూ.49 అదనం
ఈ సౌకర్యాన్ని భారత్‌లోని 150 నగరాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇప్పటికే గత ఏడాది బెంగళూరులో తన సేవలను ప్రారంభించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సేవల్ని సిలికాన్ సిటీలో ప్రారంభించింది. ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవల కోసం బెంగళూరువాసులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం గం.4.30 వరకు ఆర్డర్ చేయవచ్చు. ఈ సేవలను హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబై, పుణే, అహ్మదాబాద్, గురుగ్రామ్ తదితర నగరాలు ఉన్నాయి. ఇందుకోసం రూ.49 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరుసటి రోజుకు పార్సిల్ అందచేయకుంటే ఈ మొత్తాన్ని వినియోగదారుడికి కంపెనీ చెల్లిస్తుంది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా...
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఇప్పటికే ఫాస్ట్ డెలివరీని అందిస్తున్నాయి. ఆయా ప్రాంతాన్ని లేదా నగరాన్ని బట్టి వేగవంతమైన డెలివరీని అందిస్తున్నాయి. ఇప్పుడు షియోమీ కూడా తమ వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకునేవారికి ఒక్కరోజులోనే డెలివరీ చేయనుంది. షియోమీ రెడ్‌మీ, ఎంఐ బ్రాండ్లతో ఫోన్లను అందిస్తోంది.


Click it and Unblock the Notifications