న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో దాచుకొనే మొత్తాలకు ఆదాయపన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోనుందా? అంటే అవుననే అంటున్నారు. ఈపీఎఫ్‌పై పన్ను విధించాలనే జైట్లీ ఆలోచనపై ఈపీఎఫ్ చందాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో కేంద్ర ప్రభుత్వం తిరిగి పునరాలోచనలో పడినట్టు కనబడుతోంది. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈపీఎఫ్‌లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలని అనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందని 2016 సంవత్సరానికి గాను పార్లమెంట్‌లో సమర్పించిన బడ్జెట్‌లో పేర్కొన్నారు.

అంతేకాదు రిటైర్మెంట్ నాటికి ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిలో 40 శాతం మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదని అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ తాజా ప్రతిపాదనపై ఆరున్నర కోట్ల ఈపీఎఫ్ చందాదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా దీనిపై ట్విట్టర్‌లో స్పందించారు.
ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్ పీఎస్ పన్నుల విధానంలో ప్రతిపాదిత మార్పుల పట్ల ఆందోళనను గుర్తించామని, దీనిపై సందేహాలను త్వరలోనే నివృత్తి చేస్తామని ఆయన ట్విట్టర్‌లో సందేశాన్ని పోస్టు చేశారు. మరోవైపు 60 శాతం మొత్తం మీద వచ్చే వడ్డీకి మాత్రమే పన్ను చెల్లించాల్సివుంటుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో రెవెన్యూ శాఖ కార్యదర్శి హసముఖ్ అదియా చెప్పారు.
మూలధనానికి పన్ను మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఏప్రిల్1,2016 నుంచి పీఎఫ్ ఖాతాల్లో జమయ్యే డబ్బులో 60 శాతంపై వచ్చే వడ్డీపైనే పన్ను భారం ఉంటుందన్నారు. నెలకు రూ.15,000 ఆదాయం వచ్చే వారి పీఎఫ్ వడ్డీపై ఎలాంటి పన్నూ ఉండదన్నారు.


Click it and Unblock the Notifications