39వేల మార్క్ దాటిన సెన్సెక్స్, మార్కెట్ లాభాలు అందుకే!
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. నిన్న ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత స్వల్పనష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే. మార్కెట్లు నిన్న డే-హైతో 475 పాయింట్లు నష్టపోయింది. నిన్న 100 పాయింట్ల మేర నష్టాలతో ముగిసిన మార్కెట్, ఈరోజు లాభాలను చూశాయి.
వివిధ కారణాలతో సెన్సెక్స్ 288 పాయింట్లు(0.74 శాతం) లాభపడి 39,044.35 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు (0.71 శాతం) ఎగిసి 11,521.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85 శాతం, 1.44 శాతం మేర లాభపడ్డాయి. బీఎస్ఈ రియాల్టీ 0.58 శాతం నష్టపోయింది. మిగతా అన్నిరంగాలు లాభాల్లో ముగిశాయి.

అందుకే మార్కెట్ లాభపడింది
సహకార బ్యాంకులపై పర్యవేక్షణ అధికారాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిధిలోకి తీసుకు రావడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా సానుకూలంగా ఉన్నాయి. చైనా రిటైల్ సేల్స్ ఆగస్ట్ నెలలో పుంజుకున్నాయి. అలాగే ఉత్పాదకత పెరిగింది. కరోనా కేసులు కూడా అదుపులో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపి, ఈక్విటీ మార్కెట్లు బలపడటానికి కారణమయ్యాయి.

రియాల్టీ మినహా అన్ని రంగాలు జూమ్
బీఎస్ఈ రియాల్టీ మినహా అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. హెల్త్ కేర్, ఫైనాన్స్, బ్యాంకింగ్, పవర్, టెలికం, బేసిక్ మెటిరియల్ సూచీలు ఒక్కోటి దాదాపు ఒక శాతం మేర లాభపడ్డాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, సిప్లా, యూపీఎల్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంకు ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐచర్ మోటార్స్, ఐటీసీ ఉన్నాయి. మరోవైపు, అమెరికా డాలర్ మారకంతో రూపాయి 15 పైసలు లాభపడి 73.33 వద్ద ముగిసింది. సోమవారం 73.48 వద్ద ముగిసింది.

ఈ స్టాక్స్ జూమ్
- నిన్న చతికిలపడిన రిలయన్స్ షేర్ ఈ రోజు దాదాపు 1 శాతం లాభపడింది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎప్‌సీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇవి సెన్సెక్స్ భారీ లాభాలకు కారణం అయ్యాయి.
- ఈ రోజు స్టాక్స్‌లో ఫార్మా ఎక్కువగా లాభపడ్డాయి. సిప్లా, సన్ ఫార్మా టాప్ మంచి లాభాలు చూశాయి. సెన్సెక్స్, నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం మేర లాభపడగా, నిఫ్టీ బ్యాంకు దాదాపు 2 శాతం లాభపడింది.
- పంజాబ్ నేషనల్ బ్యాంకు మినహా నిఫ్టీ బ్యాంక్ మిగతా స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.
- క్వార్టర్ 1 ఫలితాల ప్రకటన అనంతరం బజాజ్ హెల్త్ కేర్ 11 శాతం మేర లాభపడ్డాయి.
- హెగ్జావేర్ 6 శాతం మేర లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ 0.6 శాతం లాభపడింది. ఆటో షేర్లు కూడా లాభాలు చూశాయి.