నెలకు రూ.1.75 లక్షల జీతం వస్తున్నా.. భర్త నుంచి భరణం కోరిన భార్య.. కోర్టు ఏం తీర్పు చెప్పిందంటే..
Wife Seeks Rs 1.80 Lakh Monthly Maintenance: భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తుంటే భరణం చెల్లించాలా వద్దా అనే కీలక అంశంపై కలకత్తా హైకోర్టు బుధవారం (నవంబర్ 25, 2026) సంచలన తీర్పు వెలువరించింది. తనకు ఎలాంటి ఆదాయం లేని గృహిణిని అని.. కోర్టును తప్పుదోవ పట్టించి నెలకు రూ. 45,000 భరణం ఉత్తర్వులు పొందిన భార్యపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ చైతాలి చటర్జీ దాస్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ట్రయల్ కోర్టు ఇచ్చిన భరణం ఉత్తర్వులను రద్దు చేయడమే కాకుండా.. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు భార్యకు రూ. 20,000 జరిమానా విధించింది.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. 2022లో శ్రీమతి ఘోష్ తనకు ఎలాంటి ఆదాయం లేదని, వృద్ధులైన తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నానని పేర్కొంటూ నెలకు రూ. 1,80,000 భరణం కోరుతూ సీల్దా మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు తొలుత నెలకు రూ. 20,000, అనంతరం 2024 మార్చి 30న భర్త శ్రీ ఘోష్ నెలకు రూ. 45,000 భరణం చెల్లించాలని ఆదేశించింది.

అయితే తన భార్య బెంగళూరులోని విప్రో సంస్థలో పనిచేస్తూ నెలకు రూ. 1.30 లక్షలకు పైగా సంపాదిస్తోందని.. తన ఆదాయం, బ్యాంక్ ఖాతాల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందని పేర్కొంటూ భర్త కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. దీనికి తోడు భార్య తనపై, కుటుంబంపై ఐపీసీ సెక్షన్ 498A సహా ఇతర సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు కోర్టు దృష్టికి వచ్చింది.
హైకోర్టు విచారణలో ఇరుపక్షాల ఆర్థిక రికార్డులను పరిశీలించగా కీలక వాస్తవాలు వెలుగుచూశాయి. భర్త కాగ్నిజెంట్ సంస్థలో పనిచేస్తూ నెలకు రూ. 1,15,000 సంపాదిస్తుండగా, అందులో రుణ చెల్లింపుల కింద నెలకు రూ. 40,349 ఈఎంఐ (EMI) రూపంలోనే చెల్లిస్తున్నారు. మరోవైపు భార్య సమర్పించిన జీతం స్లిప్‌ల ప్రకారం ఆమెకు జూన్ 2026లో రూ. 1,47,782, జూలై 2026లో రూ. 1,51,313, ఆగస్టు 2026లో బోనస్‌తో కలిపి రూ. 1,75,594 వేతనం అందుతున్నట్లు నిర్ధారణ అయింది.
న్యాయవాదితో జరిగిన అపార్థం వల్లే తాను గృహిణిని అని పేర్కొనాల్సి వచ్చిందని, పైగా తన భర్తే తన ఖాతాలను హ్యాక్ చేశాడని భార్య చేసిన ఆరోపణలను హైకోర్టు తోసిపుచ్చింది. దర్యాప్తులో ఆ మెయిల్ ఐడీలను ఆమె మాత్రమే వినియోగించినట్లు తేలడంతో ఆమె వాదన అబద్ధమని స్పష్టమైంది.
శ్రీమతి ఘోష్‌కు బీటెక్, ఎంసీఏ వంటి ఉన్నత విద్యార్హతలు, స్వతంత్రంగా జీవించేంత భారీ ఆదాయం ఉన్నప్పటికీ.. భర్తపై వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి, భరణం ఉత్తర్వు పొందడానికి నిజాన్ని దాచిపెట్టారని జస్టిస్ చైతాలి చటర్జీ దాస్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆస్తులు, అప్పుల అఫిడవిట్ నిబంధనలను ఆమె దుర్వినియోగం చేశారని పేర్కొంటూ భర్త చెల్లించాల్సిన రూ. 45,000 భరణం ఉత్తర్వులను రద్దు చేశారు. అలాగే రూ. 20 వేల జరిమానా మొత్తాన్ని 10 రోజుల్లోగా జువెనైల్ జస్టిస్ కమిటీకి చెల్లించాలని ఆదేశించారు.
ఈ తీర్పు నేపథ్యంలో న్యాయ నిపుణులు కీలక చట్టపరమైన అంశాలను విశ్లేషిస్తున్నారు. భారత నాగరిక సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 144 (గతంలో CrPC సెక్షన్ 125) ప్రకారం భర్త అయినంత మాత్రాన స్వయంచాలకంగా భరణం చెల్లించాల్సిన బాధ్యత ఉండదని సుప్రీంకోర్టు న్యాయవాది అమిత్‌రాజ్ కౌశల్ స్పష్టం చేశారు.
భార్య భర్త కంటే ఎక్కువ సంపాదించినప్పటికీ ఆమె భరణం కోరే హక్కును పూర్తిగా కోల్పోదు కానీ.. తన సహేతుకమైన అవసరాలను తీర్చుకోవడానికి ఆమె స్వతంత్ర ఆదాయం సరిపోతుందని తేలితే న్యాయస్థానాలు భరణాన్ని తిరస్కరిస్తాయని కరంజవాలా & కో సీనియర్ భాగస్వామి నందిని గోర్ వివరించారు. రాజ్‌నేష్ వర్సెస్ నేహా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఇరుపక్షాల వాస్తవ ఆదాయాలు, అప్పులు, ఆధారపడిన వారి బాధ్యతలను పరిగణనలోకి తీసుకుంటారని.. ఆదాయ వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం అబద్ధపు సాక్ష్యం, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications
