కరోనా మహమ్మారి నేపథ్యంలో కోట్లాది మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ అకౌంట్ నుండి డబ్బులు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో లక్షలాదిమంది ఉద్యోగులు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రావిడెంట్ ఫండ్ నుండి ఉపసంహరించుకుంటున్నారు. ఏప్రిల్ నుండి దాదాపు 55 లక్షల మంది ఈఫీఎఫ్ అకౌంట్ హోల్డర్లు దాదాపు రూ.15,000 కోట్లు రిటైర్మెంట్ ఫండ్స్ నుండి ఉపసంహరించుకున్నారు.

ఉపసంహరణ భారమా?
కరోనా నేపథ్యంలో పీఎఫ్ అకౌంట్ నుండి నగదు ఉపసంహరించుకుంటున్నారు సరే కానీ ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుందో రాదో చూసుకోవడం ముఖ్యం అని ఆదాయపన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఐదేళ్ల సేవల తర్వాత ఉపసంహరించుకుంటే మాత్రమే అసలు, వడ్డీకి పన్ను మినహాయింపు వర్తిస్తుందని చెబుతున్నారు. అంతకంటే ముందే డబ్బులు విత్ డ్రా చేసుకుంటే ఉద్యోగి, యజమాని చేసిన జమపై వడ్డీకి పన్ను కట్టవలసి వస్తుందంటున్నారు. ఉద్యోగి జమ చేసిన మొత్తానికి మాత్రం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. క్లెయిమ్ చేసుకునే వరకు పన్ను విధించబడుతుంది.

ఇలా పన్ను మినహాయింపు అర్హత
ఉద్యోగి అనారోగ్యంపాలైతే లేదా యజమాని వ్యాపారం నిలిచివేసినప్పుడు వంటి కారణాల వల్ల కూడా ఐదేళ్ల కంటే ముందే నగదును ఉపసంహరించుకోవచ్చు. అలాగే, ఐదేళ్ల పాటు ఉద్యోగం కంటిన్యూ చేయని పక్షంలో.. కొత్త ఉద్యోగంలోకి మారితే పీఎఫ్ మొత్తాన్ని ట్రాన్సుఫర్ చేసుకోవాలి. పీఎఫ్ ఖాతాను బదలీ చేస్తే సర్వీస్ కొనసాగింపు లభించి పన్ను మినహాయింపుకు అర్హత ఉంటుంది.

ఇలా మినహాయింపు
ఉద్యోగం మారినప్పుడు UAN ద్వారా ఖాతాను బదలీ చేసుకోవాల్సి ఉంటుంది. పాత ఖాతా నుండి కొత్త ఖాతాలోకి డబ్బులు బదలీ అవగానే మినహాయింపు, ఉపసంహరణకు అర్హత పొందుతారు. అంటే మీ పాత ఈపీఎఫ్ అకౌంట్ నుండి కొత్త దానికి బదలీ చేస్తే ఉపసంహరణ సమయంలో పన్ను ఆదాకు ఉపయోగపడుతుంది.

ఆన్‌లైన్ ద్వారా ఈపీఎఫ్ ట్రాన్సుఫర్ ఇలా
- ఈపీఎఫ్ఓ అకౌంట్‌లోకి యూఏఎన్, పాస్ వర్డ్ ద్వారా లాగిన్ కావాలి.
- ఆన్‌లైన్ సర్వీసెస్‌లోకి వెళ్లి వన్ మెంబర్ వన్ ఈపీఎప్ అకౌంట్ (ట్రాన్సుఫర్ రిక్వెస్ట్) పైన క్లిక్ చేయాలి.
- గెట్ డిటైల్స్ పైన క్లిక్ చేయాలి. ఇది పాత యజమానికి సంబంధించినది.
- ఫారం ధృవీకరణకు కొత్త లేదా పాత యజమానిని ఎంచుకోవాలి.
- గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. మీకు ఓటీపీ వస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్‌మిట్ కొట్టాలి.


Click it and Unblock the Notifications