బంగారు ఆభరణాల కొనుగోళ్లపై KYC నిబంధన.. వారికి వర్తించదు
న్యూఢిల్లీ: భారీ మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారా? అయితే మీరు KYC సమర్పించాలి. రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారం, వెండి, విలువైన రత్నాలు, రాళ్లు కొనుగోలు ట్రాన్సాక్షన్స్ పైన కేవైసీ వివరాలు కచ్చితంగా సమర్పించాలి. పాన్ కార్డు నెంబర్, కేవైసీ వివరాలు అందించాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేంద్రం గత నెల 28వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ పైన ఆర్థిక శాఖ వర్గాలు ఈ మేరకు వివరణ ఇచ్చాయి.

ఆభరణాల కొనుగోలు వ్యాల్యూపై వివరణ
బంగారం, వెండి లేదా రత్నాభరణాలను నగదు ఇచ్చి కొనుగోలు చేసే వారందరకీ ఈ కొత్త కేవైసీ నిబంధన వర్తించదని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. అధిక విలువ కలిగిన ట్రాన్సాక్షన్స్‌కు మాత్రమే పాన్, ఆధార్ వంటి వివరాలు ఇవ్వవలసి ఉంటుందని గత నెల జారీ చేసిన నోటిఫికేషన్ చెబుతోంది. దీనిపై వివరణ ఇచ్చారు. అయితే అభరణాలు, మేలిమి బంగారం, రత్నాలు రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదుతో కొనుగోలు చేస్తే కేవైసీ ఉండాలి.

రూ.2 లక్షల లోపు అయితే అవసరం లేదు
బంగారం, జ్యువెల్లరీ, రత్నాల కొనుగోళ్ల కోసం కేవైసీ లేకుండా రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపేందుకు గత కొన్నేళ్లుగా అనుమతించడం లేదని, ఈ విధానం కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం తేల్చి చెప్పింది. అయితే రూ.2 లక్షల లోపు నగదు లావాదేవీలు జరిపితే మాత్రం ఈ వివరాలను సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది.

తప్పుడు ప్రచారం అందుకే వివరణ
గత నెల జారీ చేసిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF) నిబంధనల ప్రకారం కేవైసీ తప్పనిసరి. చట్ట విరుద్ద లావాదేవీలను నివారించడానికి ఈ నిబంధనను అమలులోకి తీసుకు వచ్చారు. కాగా, రూ.2 లక్షల లోపు విలువ గల బంగారు ఆభరణాలు, వెండి, రత్నాభరణాల కొనుగోలుపై కేవైసీ సమర్పించాలని తప్పుడు ప్రచారం జరగడంతో వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications