జూన్ 15 లోపు ఈ పని చేయకపోతే భారీ జరిమానా.. టాక్స్ పేయర్స్ అందరికీ కేంద్రం అలర్ట్!
ఆర్థిక సంవత్సరం 2026-27 (FY 2026-27) కు సంబంధించిన మొదటి అడ్వాన్స్ టాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ గడువు (tax deadline) జూన్ 15తో ముగియనుంది. పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక అంచనా పన్ను బాధ్యతలో కొంత భాగాన్ని ఈ తేదీ లోపు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మన దేశంలో పన్నుల విధానం "సంపాదించే కొద్దీ చెల్లించు" (Pay as you earn) అనే సూత్రంపై పనిచేస్తుంది.
ఏడాది చివర్లో ఒకేసారి పన్ను భారం పడకుండా ఉండేందుకు ఈ అడ్వాన్స్ టాక్స్ విధానాన్ని తెచ్చారు. టీడీయస్ (TDS), టీసీఎస్ (TCS) మినహాయింపులు పోను.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి లేదా సంస్థ అంచనా వేసిన పన్ను బాధ్యత ₹10,000 కంటే ఎక్కువ ఉంటే, వారు ఖచ్చితంగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించాలి.

ఎవరెవరు అడ్వాన్స్ టాక్స్ చెల్లించాలి?
జీతం తీసుకునే ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు , వ్యాపార సంస్థలతో సహా పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ నిర్దేశిత పరిమితి దాటితే అడ్వాన్స్ టాక్స్ కట్టాలి. ముఖ్యంగా కింది కేటగిరీల వారు జూన్ 15 లోపు మొదటి విడత పన్ను చెల్లించాల్సి ఉంటుంది..
- జీతం వస్తూనే.. క్యాపిటల్ గెయిన్స్ (షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లాభాలు) ద్వారా అదనపు ఆదాయం పొందే ఉద్యోగులు.
- ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి పొందుతున్న నిపుణులు , కన్సల్టెంట్లు.
- ఇళ్లు, స్థిర ఆస్తుల ద్వారా ₹10,000 కంటే ఎక్కువ అద్దె ఆదాయం (Rental Income) పొందుతున్న యజమానులు.
- ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), సేవింగ్స్ అకౌంట్లపై వచ్చే వడ్డీ ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న వ్యక్తులు.
- వ్యాపారం లేదా ప్రొఫెషనల్ ఆదాయం కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లు.
సీనియర్ సిటిజన్లకు మినహాయింపు ఉందా?
వయసు 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సీనియర్ సిటిజన్లకు అడ్వాన్స్ టాక్స్ నుండి ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. వీరికి ఎలాంటి వ్యాపార లేదా వృత్తిపరమైన ఆదాయం (Business or Professional Income) లేకపోతే, వీరు అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం పెన్షన్, ఇంట్రెస్ట్ లేదా అద్దె ఆదాయం మాత్రమే ఉన్న సీనియర్ సిటిజన్లకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.
అడ్వాన్స్ టాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ షెడ్యూల్ (ముఖ్యమైన గడువులు)
అడ్వాన్స్ టాక్స్‌ను ఆర్థిక సంవత్సరంలో మొత్తం నాలుగు విడతల్లో ఈ కింది పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది..
- జూన్ 15, 2026 లోపు: మొత్తం పన్ను అంచనాలో కనీసం 15 శాతం చెల్లించాలి.
- సెప్టెంబర్ 15, 2026 లోపు: మొత్తం పన్ను అంచనాలో కనీసం 45 శాతం పూర్తి చేయాలి.
- డిసెంబర్ 15, 2026 లోపు: మొత్తం పన్ను అంచనాలో కనీసం 75 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
- మార్చి 15, 2027 లోపు: మొత్తం పన్ను అంచనాను 100 శాతం పూర్తిగా చెల్లించి ముగించాలి.
లంప్‌సమ్ (ఒకేసారి) చెల్లింపు ఎవరికి వర్తిస్తుంది?
ఎవరైనా ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపారస్తులు 'ప్రిజమ్ప్టివ్ టాక్సేషన్' (Presumptive Taxation) స్కీమ్‌ను ఎంచుకుంటే, వారు నాలుగు విడతల్లో కాకుండా.. 100% అడ్వాన్స్ టాక్స్‌ను ఒకేసారి మార్చి 15, 2027 లోపు లేదా మార్చి 31, 2027 లోపు పూర్తిగా చెల్లించవచ్చు.
ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ టాక్స్ కట్టడం ఎలా? (Step-by-Step)
ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఈ పన్నును సులభంగా చెల్లించవచ్చు..
- స్టెప్ 1: ఇన్‌కమ్ టాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు (https://www.incometax.gov.in/) వెళ్లి లాగిన్ అవ్వండి.
- స్టెప్ 2: మెనూలో ఉన్న 'e-File' ఆప్షన్‌పై క్లిక్ చేసి, 'e-Pay Tax' ను సెలెక్ట్ చేసుకోండి.
- స్టెప్ 3: ఆ తర్వాత 'New Payment' బటన్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 4: ఇన్‌కమ్ టాక్స్ ఆప్షన్‌ను ఎంచుకుని, అందులో 'Advance Tax' కాలమ్‌ను చూసి 'Proceed' నొక్కండి.
- స్టెప్ 5: అసెస్‌మెంట్ ఇయర్ (Tax Year) 2026-27 గా ఎంచుకోండి. మైనర్ హెడ్‌గా 'Advance Tax (Code 100)' ను సెలెక్ట్ చేయండి.
- స్టెప్ 6: మీ ఆదాయ అంచనాల ప్రకారం పన్ను, సర్‌చార్జ్, సెస్ వంటి వివరాలను నమోదు చేయండి.
- స్టెప్ 7: నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా యూపీఐ వంటి పేమెంట్ మోడ్‌ను ఎంచుకుని 'Pay Now' పై క్లిక్ చేసి పేమెంట్ పూర్తి చేయండి.
డెడ్‌లైన్ మిస్ అయితే ఎంత వడ్డీ పడుతుంది?
నిర్దేశిత గడువులోగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించకపోతే, ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ప్రతి నెలా వడ్డీ రూపంలో పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది..
- సెక్షన్ 424 (గతంలో సెక్షన్ 234B): ఒక పన్ను చెల్లింపుదారు మార్చి 31 నాటికి తమ మొత్తం పన్ను బాధ్యతలో కనీసం 90 శాతం పన్ను చెల్లించడంలో విఫలమైతే, తదుపరి ఏప్రిల్ 1 నుండి పన్ను చెల్లించే వరకు బకాయి ఉన్న మొత్తంపై ప్రతి నెలా 1% సాధారణ వడ్డీ పడుతుంది.
- సెక్షన్ 425 (గతంలో సెక్షన్ 234C): ప్రతి త్రైమాసిక డెడ్‌లైన్ (ఉదాహరణకు జూన్ 15 లోపు 15%) ప్రకారం చెల్లించాల్సిన పన్నులో కొరత ఉంటే, ఆ షార్ట్‌ఫాల్ మొత్తంపై నెలకు 1% చొప్పున మూడు నెలల పాటు వడ్డీ విధిస్తారు.


Click it and Unblock the Notifications