Ruchi Soya IPO: ఎట్టకేలకు ఓ పబ్లిక్ ఇష్యూ: రామ్‌దేవ్ బాబా కంపెనీతో ఎంట్రీ
ముంబై: ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ల కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న రిటైల్ ఇన్వెస్టర్ల నిరీక్షణ ఫలించబోతోంది. ఎట్టకేలకు ఓ ఐపీఓ జారీ కాబోతోంది. యోగా గురు రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఈ ఐపీఓ వెలువడబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతులను మంజూరు చేశారు. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా సేకరించాల్సిన మొత్తాన్ని ఖరారు చేశారు.

మూడంటే మూడే..
ఈ సంవత్సరం ప్రారంభం నుంచీ పబ్లిక్ ఇష్యూల వెల్లువ ఉంటుందని రిటైల్ ఇన్వెస్టర్లు అంచనా వేసుకున్నప్పటికీ.. అవి తలకిందలయ్యాయి. ఇప్పటిదాకా మూడంటే మూడు ఐపీఓలు మాత్రమే జారీ అయ్యాయి. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెగ్మెంట్స్‌కు చెందిన అదాని విల్మార్, క్యాష్ మేనేజ్‌మెంట్ సెక్టార్ నుంచి ఏజీఎస్ టెక్నాలజీస్, మాన్యవర్ ఐపీఓలు మాత్రమే వెలువడ్డాయి. ఎల్ఐసీ, గో ఎయిర్ వంటివి రావాల్సి ఉన్నప్పటికీ.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి.

సుదీర్ఘ విరామం తరువాత..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియబోతోండటం కూడా దీనికి ఓ కారణమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతోన్నందున.. అప్పుడు పబ్లిక్ ఇష్యూలను జారీ చేయడానికి పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ పరిణామాల మధ్య ఎట్టకేలకు ఓ ఐపీఓ ఇన్వెస్టర్ల ముందుకు రాబోతోంది. సుదీర్ఘ విరామం తరువాత ఇది మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

రూ.4,300 కోట్ల సమీకరణ..
యోగా గురు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన రుచి సోయా ఐపీఓ (Ruchi Soya IPO) జారీ కాబోతోంది. ఇది కూడా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ సెగ్మెంట్‌కే చెందినదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 4,300 కోట్ల రూపాయల మేర మొత్తాన్ని సమీకరించుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి అవసరమైన చర్యలను పూర్తి చేసింది. అడ్వైజర్లను కూడా నియమించుకుంది.

24న ఓపెన్..
ఈ నెల 24వ తేదీన రుచి సోయా ఐపీఓ జారీ కానుంది. 28వ తేదీన ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఎంత అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. 4,300 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలనే లక్ష్యంతో రానున్నందున- ఒక్కో పబ్లిక్ ఇష్యూ వేల్యూ 300 నుంచి 400 రూపాయల వరకు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
నిజానికి గత సంవత్సరం ఆగస్టులోనే ఐపీఓను జారీ చేయడానికి అవసరమైన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌పై సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ నుంచి అనుమతులను పొందింది.

ఈ మొత్తంతో..
ఆ తరువాత పరిణామాలు అనుకూలించకపోవడంతో జాప్యం ఏర్పడింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తంతో రుణాలను చెల్లించడం, వర్కింగ్ కేపిటల్‌ను పెంచుకోవడం, ఇతర కార్పొరేట్ వ్యవహారాల కోసం మళ్లించుకుంటామని కంపెనీ తెలిపింది. వంటనూనెల సెగ్మెంట్‌లో రుచి సోయా వాటా భారీగా ఉండటం వల్ల మంచి అంచనాలే వ్యక్తమౌతున్నాయి. మహాకోశ్, సన్‌రిచ్, రుచి గోల్డ్, న్యూట్రెల్లా వంటి బ్రాండ్ల వంటనూనెలను విక్రయిస్తోందీ కంపెనీ.


Click it and Unblock the Notifications