దాదాపు 66 శాతం మంది క్యాంపస్ గ్రాడ్యుయేట్స్ ఎలాంటి ఉద్యోగాలు లేకుండా ఉన్నారని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ డాట్ కామ్ సర్వేలో వెల్లడైంది. కాలేజ్ పాసవుట్ విద్యార్థుల్లో ఆఫర్ లెటర్స్ అందుకున్నవారిలో 44 శాతం మంది ఉద్యోగంలో చేరే తేదీ ఆలస్యమవుతోందని వెల్లడించారు. మరో 9 శాతం మంది తమకు ఇచ్చిన ఆఫర్ లెటర్స్‌ను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. మొత్తం 1300 కాలేజీ విద్యార్థులపై చేసిన సర్వే ఆధారంగా ఈ నివేదికను తయారు చేసింది.

ఉద్యోగ అవకాశాల కోసం ఇలా..
చాలామంది విద్యార్థులు ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. 17 శాతం మంది రిఫరెన్స్ మార్గాన్ని, తమ పూర్వ కళాశాల విద్యార్థులతో కనెక్ట్ అవుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. కొంతమంది విద్యార్థులు ఫ్రీలాన్సింగ్‌లో భవిష్యత్తును ఎంచుకుంటున్నారని తేలింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ కెరీర్‌కు ఇది ఉత్తమమైనదిగా భావిస్తున్నారు.

కాలేజీలపై, ఇంటర్న్‌షిప్ ఆఫర్లపై ప్రభావం
కరోనా మహమ్మారి ప్రభావం 2020 బ్యాచ్‌కు చెందిన 82 శాతం కాలేజీలను తాకింది. 74 శాతం ప్రీ-ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఇంటర్న్‌షిప్స్ ఆఫర్లపై ప్రభావం పడింది. అయినప్పటికీ చాలామంది విద్యార్థులు దృఢ విశ్వాసంతో ఉన్నారు. వర్చువల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ, కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. కరోనా కారణంగా ఎక్కువ కంపెనీల్లో నియామకాలు చేపట్టడం లేదు. అయితే నియామకాలు చేపట్టే చాలా కంపెనీలు రిమోట్ మార్గాన్ని ఎంచుకుంటున్నాయని ఫస్ట్ నౌకరీ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శరద్ సింధ్వానీ చెప్పారు.

ఆన్ లైన్ కోర్సులు
ఫ్రెషర్స్ ఆన్‌లైన్ కోర్సు వంటి వాటిని ఎంచుకుంటున్నారు. 70 శాతం కాలేజీ విద్యార్థులు ఆన్ లైన్ కోర్సులకు సబ్‌స్క్రైబ్ అయ్యారు. తమ తమ రంగాల్లోని పరిణామాలు తెలుసుకోవడానికి ఇందులో సగం మంది ఎప్పటికప్పుడు న్యూస్ చదువుతారు. తమ ఉన్నత విద్య ప్రణాళికపై ప్రభావం చూపలేదని 80 శాతం మంది చెప్పారు. కాగా, కరోనా కారణంగా దాదాపు అన్ని రంగాలు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం మొదలు ఏ దేశంలోను పరిస్థితి ఆశాజనకంగా లేదు.


Click it and Unblock the Notifications