అమెజాన్‌పై అవసరమైతే వీధిపోరాటం, ఎందుకంటే: ఖండించిన ఈ-కామర్స్ దిగ్గజం
ట్రేడర్స్ బాడీ CAIT ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పైన ఆరోపణలు చేసింది. అమెజాన్ ఎఫ్‌డీఐ విధానాన్ని, విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘిస్తోందని ట్రేడర్ల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలను అమెజాన్ ఖండించింది. భారత్‌లో మల్టీ బ్రాండ్ రిటైల్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అమెజాన్ ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు CAIT లేఖ రాసింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని, గరిష్ట జరిమానా విధించాలని డిమాండ్ చేసింది.

CAIT ఆరోపణ.. అమెజాన్ వివరణ
అమెజాన్ వెబ్ సైట్‌లోని సమాచారం ప్రకారం అమెజాన్ ఇండియాలో అమెజాన్ సంస్థ దాదాపు రూ.35,000 కోట్ల పెట్టుబడులు పెట్టిందని, వాస్తవానికి పరోక్షంగా మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తోందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేవాల్ అన్నారు.
అయితే భారతదేశంలో బాధ్యత కలిగిన పెట్టుబడిదారుగా ఎఫ్‌డీఐ నిబంధనలను అమెజాన్ పాటిస్తోందని, భవిష్యత్తు పెట్టుబడులను నిబంధనలకు అనుగుణంగా పెడతామని అమెజాన్ ప్రతినిధి తెలిపారు.

మల్టీ బ్రాండ్ రిటైల్ కార్యకలాపాలు
అమెజాన్ మల్టీ బ్రాండ్ రిటైల్ కార్యకలాపాల్లో రూ.4,200 కోట్ల పెట్టుబడులు పెట్టిందని CAIT ఆరోపించింది. ఫ్యూచర్ కూపన్స్ ప్రయివేట్ లిమిటెడ్‌లో రూ.1430 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని పేర్కొంది. ఇలా చేయడం ఫెమా నియమ నిబంధనలను ఉల్లంఘించడమేనని, కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ దిగ్గజ ఈ-కామర్స్ పైన ఈడీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీయూష్ గోయల్‌ను డిమాండ్ చేశారు.

వీడియో కాల్ మీటింగ్
దీనికి సంబంధించి శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా ట్రేడ్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు ఖండేవాల్ తెలిపారు. అమెజాన్ పైన ఎలాంటి చర్యలు తీసుకోని పక్షంలో వ్యాపారులు అంతా ఆందోళనకు దిగే పరిస్థితి ఉంటుందని ఈ అంశంపై అవసరమైతే కోర్టును ఆశ్రయించేందుకు కూడా వెనుకాడేది లేదని CAIT తెలిపింది. అయితే అమెజాన్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తాము అన్ని నిబంధనలు పాటిస్తున్నామని వెల్లడించింది.