హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లిపోవచ్చు ఇక..
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపిస్తూ.. మెట్రో ప్రయాణికులకు సులభమైన లాస్ట్-మైల్ కనెక్టివిటీ అందించేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆధునిక పట్టణ రవాణా విధానాల్లో భాగంగా నగరంలో పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) లేదా పాడ్ ట్యాక్సీలు ప్రవేశపెట్టే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కన్సల్టెంట్‌ను నియమించేందుకు Hyderabad Metro Rail Limited (HMRL) తాజాగా టెండర్లను ఆహ్వానించింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో మెట్రో సేవలు ప్రధాన మార్గాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గిస్తున్నప్పటికీ.. మెట్రో స్టేషన్ నుంచి కార్యాలయాలు లేదా నివాస ప్రాంతాలకు చేరుకునే చివరి దశ ప్రయాణం ప్రయాణికులకు పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సచివాలయం వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రాయదుర్గం, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ల వద్ద దిగిన ప్రయాణికులు, ఆపై ఆటో లేదా క్యాబ్ కోసం వేచి ఉండాల్సి రావడం, ట్రాఫిక్‌లో చిక్కుకోవడం సాధారణంగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పాడ్ ట్యాక్సీలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ప్రతిపాదిత పీఆర్‌టీఎస్ వ్యవస్థలో చిన్న పరిమాణంలోని పాడ్ కార్లు డ్రైవర్ లేకుండా, పూర్తిగా విద్యుత్‌తో నడుస్తాయి. pod taxi లు ప్రత్యేకంగా నిర్మించే ఎలివేటెడ్ ట్రాక్‌లపై ప్రయాణిస్తాయి. ఒక్కో పాడ్ కారులో సుమారు 4 నుంచి 8 మంది వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. మెట్రో స్టేషన్‌లో దిగిన వెంటనే పాడ్‌లో ఎక్కి, ట్రాఫిక్‌కు అతీతంగా నేరుగా కార్యాలయాలు లేదా ఇతర గమ్యస్థానాలకు చేరుకోవడమే ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. దీని వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, రోడ్లపై వాహనాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో చేపట్టాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ నిర్ణయించింది. ముఖ్యంగా డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (DBFOT) మోడల్‌ను అనుసరించనున్నారు. ఈ విధానంలో ప్రైవేట్ భాగస్వాములు ప్రాజెక్టు రూపకల్పన నుంచి నిర్వహణ వరకు బాధ్యతలు తీసుకుని, నిర్ణీత కాలం తర్వాత ప్రభుత్వానికి బదిలీ చేస్తారు. దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు, ఆధునిక సాంకేతికతను వేగంగా అమలు చేసే అవకాశం ఉంటుంది.
వాస్తవానికి, గతంలో Bharat Rashtra Samithi (బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలోనూ పాడ్ ట్యాక్సీలపై చర్చలు జరిగాయి. అయితే వివిధ కారణాల వల్ల ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న Indian National Congress ప్రభుత్వం మాత్రం మెట్రో రెండో దశ విస్తరణతో పాటు పీఆర్‌టీఎస్ వంటి ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలో భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.
కన్సల్టెంట్ నియామకం కోసం జారీ చేసిన టెండర్లకు మార్చి 25ను చివరి తేదీగా నిర్ణయించారు. ఎంపికైన కన్సల్టెంట్ నగరంలో పాడ్ ట్యాక్సీలకు అనువైన మార్గాలు, ప్రయాణికుల డిమాండ్, వ్యయ అంచనాలు, సాంకేతిక సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ఆ నివేదిక ఆధారంగానే తుది మార్గాలు, ప్రాజెక్టు వ్యాప్తి మరియు అమలు విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఈ పాడ్ ట్యాక్సీ ప్రాజెక్టు అమలైతే, హైదరాబాద్ నగరానికి ఇది మరో గుర్తింపుగా నిలవడమే కాకుండా, దేశంలోని ఇతర మెట్రో నగరాలకు కూడా ఆదర్శంగా మారే అవకాశముందని పట్టణ రవాణా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications