కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. దేశ, అంతర్జాతీయ ఆర్థిక రంగాలు కుదేలయ్యాయి. ఉత్పత్తి నిలిచి, డిమాండ్ తగ్గి కోట్లాది ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కోల్పోయిన ఉద్యోగాల కంటే లాక్ డౌన్ తర్వాత కోల్పోయేవే ఎక్కువ అని నిపుణులు పేర్కొంటున్నారు. లాక్ డౌన్ ఎత్తివేశాక వివిధ రంగాలు నష్టాలను చవిచూసే అవకాశముంది. అదే సమయంలో కొన్ని రంగాలు చాలా వేగంగా కోలుకుంటాయని చెబుతున్నారు.

లాక్ డౌన్ తర్వాత వేగంగా కోలుకునే రంగాలు.. ఉద్యోగాలు పెరగొచ్చు
దేశవ్యాప్త లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం చాలా వేగంగా కోలుకునే రంగాల్లో ఫార్మా, వైద్య, ఆరోగ్య పరికరాలు, డిజిటల్ సేవలు, లాజిస్టిక్స్, ట్రాన్సుపోర్ట్, గిడ్డంగులు, ఈ కామర్స్, హోమ్ డెలివరీ సేవలు ఉన్నాయి. ఈ రంగాల్లో ఉద్యోగాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ప్రజల ధోరణిని అనుసరించి
ప్రజల ధోరణిపై ఆధారపడి ఆయా రంగాలు కోలుకునేందుకు ఎక్కువ, తక్కువ సమయం తీసుకుంటాయని చెబుతున్నారు. ఫార్మా, వైద్య, ఆరోగ్య సామాగ్రి, డిజిటల్ రంగాలు బాగా రాణిస్తున్నాయి. డిజిటల్ ప్రపంచంతో సంబంధం ఉండే లాజిస్టిక్స్, సరఫరా రంగాలు కూడా వేగంగా రాణించగలవని అంటున్నారు.

పుంజుకోవడం ఖాయం
నిత్యావసర వస్తువులకు గిరాకీ కొనసాగుతుందని చెబుతున్నారు. దీంతో రవాణా, నిల్వ, వేర్ హౌస్ రంగాలు లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత వేగంగా పుంజుకోవడం ఖాయమని అంటున్నారు.

సమయం తీసుకునే రంగాలు.. ఉద్యోగాలు ఊడిపోవచ్చు
హోటల్స్, పర్యాటక రంగం మాత్రం కోలుకోవడానికి సమయం పడుతుందని భావిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత ప్రయాణాలు తగ్గిపోతాయి. హోటల్స్, విదేశీ ప్రయాణాలు, షాపింగ్ మాల్స్ పైన కూడా కొద్దినెలలు ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే ఆ తర్వాత కూడా ప్రజల ధోరణిపై ఈ రంగాలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు. హోటల్స్, విమానయానం, పర్యాటక రంగం పైనే ఎక్కువ ప్రభావం పడనుంది. కరోనా కారణంగా ఈ-కామర్స్, రిటైల్, హోమ్ డెలివరీకి మరింత డిమాండ్ పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications