హైదరాబాద్: భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ఎగుమతుల పరంగా కీలక ముందడుగు వేసింది. బ్రిటీష్ సైన్యంతోపాటు ప్రపంచ రక్షణ దళాలు వినియోగిస్తున్న స్టార్ స్ట్రీక్ క్షిపణి వ్యవస్థ ఉత్పత్తిలో భాగస్వామిగా మారింది. సాయుధ హెలికాప్టర్లతోపాటు గగనతల లక్ష్యం ఏదైనా ఛేదించే సామర్థ్యం కలిగిన అత్యంత వేగవంతమైన క్షిపణి ఇదే కావడం గమనార్హం.
స్టార్ స్ట్రీక్ క్షిపణిని యుకేకు చెందిన థేల్స్ సంస్థతో కలిసి హైదరాబాద్ యూనిట్‌లో ఉత్పత్తి చేసి, యూకే, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేలా బీడీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్, బ్రిటీష్ ప్రభుత్వాల మద్దతుతో ఈ మేరకు టీమ్ డీల్ పై సంతకం చేసినట్లు బీడీఎల్ తెలిపింది. రక్షణ ఎగుమతులతో ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్న బీడీఎల్‌కు తాజా ఒప్పందం ఊతమిచ్చేలా ఉంది.

స్టార్ స్ట్రీక్ క్షిపణి గ్లోబల్ సప్లై చైన్‌లో... బీడీఎల్ భాగమయ్యేందుకు అవకాశాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో కొత్త దేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఈ సాంకేతిక బదిలీతో భారత్ లో తయారీకి కూడా మార్గం సుగమమైంది. 60 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి భారత రక్షణ దళాలకు ఈ క్షిపణిని అందించవచ్చు.
అంతేగాక, భారత్-యూకే మధ్య పారిశ్రామిక సహకారానికి కూడా ఈ ఒప్పందం ఊతమిస్తోంది. ఈ సందర్భంగా బీడీఎల్ సీఎండీ కమోడోర్ సిద్ధార్థ్ మిశ్ర మాట్లాడుతూ.. థేల్స్, బీడీఎల్ మధ్య జరిగిన స్టార్ స్ట్రీక్ క్షిపణి సాంకేతికత బదిలీ ఒప్పందం కీలకమైందన్నారు. బీడీఎల్, ఇతర భాగస్వామ్య సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాన్ని సృష్టిస్తుందని తెలిపారు. ఎగుమతి మార్కెట్లోనూ బీడీఎల్ విస్తరించేందుకు దోహదం చేస్తుందని తెలిపారు.
మనదేశంలో తయారీ, సులభతర వ్యాపారం, ఇటీవలి ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో విదేశీ సంస్థలతో జట్టు కట్టేందుకు, ఇక్కడ ఉత్పత్తి చేసి యూకేతో సహా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు అనువైన సరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. తాజా ఒప్పందం ఇరు సంస్థలకు కీలక మైలురాయిగా థేల్స్ సీఈఓ అలెక్స్ క్రెస్‌వెల్ అభివర్ణించారు.


Click it and Unblock the Notifications