తక్కువ రేటింగ్ సాధనాల్లో పీఎఫ్ పెట్టుబడులు- ఖాతాదారులకు రిస్కే అంటున్న నిపుణులు..
తక్కువ రేటింగ్ సాధనాల్లో పెట్టుబడులకు గుర్తింపు పొందిన పీఎఫ్ సంస్ధలను అనుమతిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తీసుకున్న నిర్ణయం వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. 2021 ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే ఈ నిర్ణయం ప్రకారం గుర్తింపు పొందిన పీఎఫ్ ట్రస్టులు తమ పెట్టుబడులను తక్కువ రేటింగ్ ఉన్న సంస్ధల్లోనూ పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సీబీడీటీ నిర్ణయం ప్రభావంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతిమంగా ఇది పీఎఫ్ ఖాతాదారులకు రిస్క్‌గా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
1962 ఆదాయపు పన్ను నిబంధనల్లో రూల్ 67(2) ప్రకారం గుర్తింపు పొందిన పీఎఫ్ ట్రస్టులు తమ పెట్టుబడులను దేశంలో ఏఏ రేటింగ్ ఉన్న సాధనాల్లోనే పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. దీని వల్ల దీర్ఘకాలంలో సదరు పెట్టుబడులు సురక్షితంగా ఉంటడమే కాకుండా పీఎఫ్ ఖాతాదారుల నమ్మకం కూడా పదిలంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఏఏకు బదులుగా ఏ రేటింగ్ ఉన్న సాధనాల్లో కూడా పెట్టుబడి పెట్టేందుకు పీఎఫ్ ట్రస్టులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయా ట్రస్టులు ఏ రేటింగ్ సంస్ధల్లో పెట్టుబడులకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజా నిర్ణయం ప్రకారం గుర్తింపు పొందిన పీఎఫ్ ట్రస్టులు తమ వద్ద ఉన్న మొత్తాల్లో పోస్టాఫీసులు, వాణిజ్య బ్యాంకుల్లో ఉన్న మొత్తం కాకుండా 35 శాతాన్ని ఏ రేటింగ్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇవి గరిష్టంగా 45 శాతం వరకూ వెళ్లేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఏ రేటింగ్ ఉన్న పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడుల విషయంలో నిపుణులు పెదవి విరుస్తున్నారు. దేశంలో జనం ఎక్కువగా నమ్మే పీఎఫ్ పెట్టుబడులను తక్కువ రేటింగ్ సంస్ధల్లో పెట్టేందుకు అనుమతించడం ద్వారా వీటిపై ఉన్న నమ్మకం తగ్గిపోతుందని, అంతిమంగా ఇది పీఎఫ్ వ్యవస్ధకే నష్టం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications