నవంబర్ 27న స్టాక్ మార్కెట్‌కు సెలవు.. ఎందుకు?
ముంబై: స్టాక్ మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. శని, ఆదివారాల్లో వీకెండ్ హాలిడే కాగా.. సోమవారం కూడా స్టాక్ మార్కెట్ తెరచుకోదు. ఎలాంటి కార్యకలాపాలు కొనసాగవు. పబ్లిక్ హాలిడే కావడం వల్ల అన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల తరహాలోనే షేర్ మార్కెట్‌కు కూడా సెలవు ఉంటుంది.
దీనికి కారణం- ఆ రోజున గురు నానక్ జయంతి. సిక్కు మత స్థాపకుడు, మత గురువు గురు నానక్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సెలవు ఉంటుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ కూడా ఆ రోజున పాక్షికంగా మూతపడుతుంది.

సాధారణంగా ఎంసీఎక్స్ కార్యకలాపాలు రెండు సెషన్లుగా కొనసాగుతుంటాయనే విషయం తెలిసిందే. తొలి సెషన్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సెకెండ్ సెషన్ సాయంత్రం 5 నుంచి రాత్రి 11:50/11:55 నిమిషాల వరకు ఉంటుంది. సోమవారం నాడు తొలి సెషన్ ఉండదు. సెకెండ్ సెషన్ యధాతథంగా కొనసాగుతుంది.
స్టాక్ ఎక్స్ఛేంజీల్లో మాత్రం సోమవారం నాడు ఆర్థిక లావాదేవీలేవీ చోటు చేసుకోవు. 28వ తేదీన యధాతథంగా స్టాక్ మార్కెట్ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ఈ ఏడాది మొత్తం 15 హాలిడేలు ఉండగా.. అందులో చివరి రెండు మిగిలివున్నాయి. గురునానక్ జయంతితో పాటు డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా షేర్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది.


Click it and Unblock the Notifications