ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడని రంగాలు లేవు. ఆయా దేశాల్లో అప్పటికే ఉన్న పరిస్దితుల ఆధారంగా కాస్త ఎక్కువ లేదా తక్కువ అంతే. భారత్ లోనూ కరోనా లాక్ డౌన్ ప్రభావంతో దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. వీటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న దేశీయ రేటింగ్ సంస్ధ క్రిసిల్ తాజాగా ప్రకటించిన అంచనాలు ఇక్కడి ప్రభుత్వాలకు షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

లాక్ డౌన్ ప్రభావమెంత ?
కరోనా వైరస్ వ్యాప్తి భయాలతో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ అప్పటికే రెవెన్యూ లోటుతో పాటు భారీ అప్పుల్లో కూరుకుపోయిన కొన్ని రాష్ట్రాల పాలిట శాపంగా పరిణమించబోతోందని దేశీయ రేటింగ్ సంస్ధ క్రిసిల్ అంచనా వేసింది. ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ కారణంగా భారీగా ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా దెబ్బతీసుకున్నట్లయిందని క్రిసిల్ తన అంచనాల్లో పేర్కొంది.

ఉపాధి రంగంపై తీవ్ర ప్రభావం...
పెట్రోలియం, మద్యం అమ్మకాలు, స్టాంప్ డ్యూటీలపై ఆధారపడటం వంటి కారణాల వల్ల దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్ధాన్ వంటి రాష్ట్రాల్లో ఉపాధిపై తీవ్ర ప్రభావం పడబోతోందని క్రిసిల్ తన అంచనాల్లో పేర్కొంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు దేశ ఉత్పత్తిలో 65.5 శాతం వాటా కలిగి ఉన్నాయని, నిర్మాణ రంగంలోనూ వీటి వాటా 60 శాతంగా ఉందని క్రిసిల్ తెలిపింది. లాక్ డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తితో పాటు నిర్మాణ రంగం కుదేలు కావడంతో ఆర్ధిక వ్యవస్ధలపై భారీ ప్రభావం తప్పదని హెచ్చరించింది.

ముంచినా, తేల్చినా ఆ 8 రాష్ట్రాలే...
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న 8 రాష్ట్రాల నుంచే జాతీయంగా 60 శాతం జీడీపీ వచ్చేదని, ఆంక్షలతో ఆ పరిస్ధితి లేకుండా పోయింది క్రిసిల్ తన తాజా నివేదికలో తెలిపింది. ఆయా రాష్ట్ర్రాల్లో ఆంక్షల కొనసాగింపు వల్ల అన్ని వ్యవస్ధలపైనా తీవ్ర ప్రభావం పడిందని, అంతిమంగా ఇది ఉపాధి, ఉద్యోగాలపైనే ప్రభావం చూపనుందని పేర్కొంది. కరోనాతో ఎక్కువగా ప్రభావితమవుతున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి వ్యాపార ఆధారిత రాష్ట్రాల్లో ఆంక్షల కొనసాగింపు ఆర్ధిక వ్యవస్ధపై తీవ్ర ప్రభావం చూపబోతోందని క్రిసిల్ అంచనా వేస్తోంది. స్ధూల రాష్ట్ర విలువ జోడింపు ( జీఎస్‌వీఏ) ప్రకారం చూసినా వ్యవసాయంలో 64 శాతం, పరిశ్రమల్లో 63 శాతం, సేవల్లో 53 శాతం ఈ 8 రాష్ట్రాల నుంచే వస్తోంది. దీంతో ఆంక్షల ప్రభావం ఇక్కడ తీవ్రంగా ఉండబోతోందని క్రిసిల్ తెలిపింది.


Click it and Unblock the Notifications