గతవారం రూపాయి భారీగా క్షీణించింది. అమెరికా కరెన్సీ డాలర్ మారకంతో ఏకంగా 75స్థాయికి చేరుకుంది. శుక్రవారం మరో 15 పైసలు పతనమై 74.73కి క్షీణించింది. అంతకుముందు సెషన్‌లో రూ.74.60 వద్ద క్లోజ్ అయింది. ఇది నవంబర్ 4, 2019 నాటి స్థాయి కావడం గమనార్హం. అంతకుముందు నాలుగు సెషన్లలోనూ రూపాయి నష్టపోయింది. మొత్తంగా ఐదు సెషన్‌లలో డాలర్ మారకంతో రూపాయి 161 పైసలు తగ్గింది. బుధవారం ఒక్కరోజే 105 పైసలు క్షీణించింది.
వరుసగా పతనం
డాలర్ మారకంతో రూపాయి గత వారం భారీగా పడిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. గ్రోత్ డిఫరెన్షియల్, ఇన్‌ఫ్లేషన్ డిఫరెన్షియల్, ఇంటరెస్ట్ డిఫరెన్షియల్ వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ఇటవలి కాలంలో రూపాయి ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి. అలాగే వరుసగా ఐదు సెషన్లు నష్టపోయింది.
రూపాయిపై ఒత్తిడి
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణతకు మరో ముఖ్య కారణం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటం. స్టాక్ మార్కెట్ల నష్టాలు, డాలర్ పట్ల ఇన్వెస్టర్ల మక్కువ కూడా కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తమ పాలసీలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకోవడం రూపాయిని ఒత్తిడిలోకి నెట్టిందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.
ఐటీ ఎగుమతులకు లాభం
రూపాయి పతనం దేశీయ దిగుమతులను భారంగా చేస్తుంది. ముఖ్యంగా ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. దేశీయ చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారా తీరుతోంది. రూపాయి ఇలా పతనమైతే ద్రవ్యోల్భణానికి దారి తీయవచ్చు. ఆయా వస్తు ఉత్పత్తుల ముడి సరుకుల దిగుమతులు ఖరీదు కావడం మరో కారణం. ఐటీ ఎగుమతులకు రూపాయి బలహీనత కలిసి వస్తుంది.