స్టాక్ ఆప్షన్ ఆఫర్ చేస్తున్న రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా ‘ఆకాశ ఎయిర్‌లైన్’
ముంబై: బిలియనీర్, స్టాక్స్ ట్రేడర్ రాకేశ్ ఝన్ ఝన్ వాలా నేతృత్వంలో నడుస్తున్న కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ ఈ ఏడాది మే నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఈ రంగంలో నిలదొక్కుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తోంది. ఇందులో భఆగంగానే ఉన్నతోద్యోగులతోపాటు సామాన్య సిబ్బందిని కూడా ఆకర్షించేందుకు వారికి స్టాక్ ఆప్షన్స్‌ని ఆఫర్ చేయాలని భావిస్తోంది.
ఈ మేరకు ఆకాశ ఎయిర్‌లైన్ కంపనీ సీఈవో వినయ్ దూబే ఈ మేరకు వెల్లడించారు. సాధారణంగా స్టాక్ ఆప్షన్‌ని నైపుణ్యం కలిగిన ఉద్యోగుల్ని ఆకర్షించడానికి సాంకేతిక రంగంలో వచ్చే స్టార్టప్‌లు ఆఫర్ చేస్తుంటాయి. అయితే, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఈ రంగంపై ఆధారపడ్డ అనేక మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. వారిలో ప్రతిభ గల వారిని ఆకర్షించి ఆదుకోవడమే తమ ఉద్దేశమని ఆకాశ ఎయిర్ లైన్ తెలిపింది. ఇతర ఏ సంస్థల్లో.. చివరకు టెక్ స్టార్టప్ లు కూడా అందించని స్థాయిలో తమ ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్ ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
పైలట్లు, సహాయక సిబ్బందికి మాత్రం ఇది వర్తించదని తెలిపాయి. రాకేశ్ ఝన్ ఝన్ వాలా సహా మరికొంత మంది ఇండస్ట్రీ పెద్దలు కలిసి ఏర్పాటు చేశారు ఈ ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థ. కాగా, ఇప్పటి వరకు సన్నాహాక పనుల కోసం 50 మంది ఉద్యోగుల్ని నియమించుకుంది. ప్రస్తుతం పైలట్లు, సహాయక సిబ్బంది, ఎయిర్ పోర్టు స్టాఫ్ నియామక ప్రక్రియ కొనసాగుతున్నట్లు వినయ్ దూబే తెలిపారు. కాగా, ఇటీవల ఎయిరిండియాను టాటా గ్రూప్ ఇటీవల తిరిగి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications