న్యూఢిల్లీ: ఇటీవల పెంచిన రైల్వే ఛార్జీలు ఏడాదిలో రైల్వే నమోదు చేసిన రూ.55 వేల కోట్ల నష్టంలో కేవలం 5 శాతాన్ని మాత్రమే భర్తీ చేయగలిగామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ భారం ప్రయాణీకులపై స్వల్పంగానే ఉంటుందని చెప్పారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.

ఛార్జీల పెంపు సున్నితం.. అందుకే
2004లో ప్రయాణీకుల సర్వీసులో రూ.8వేల కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా ప్రయాణీకుల సర్వీసుల విభాగంలో రూ.55వేలకోట్ల నష్టాలు వచ్చాయని గోయల్ చెప్పారు. ప్రయాణ ఛార్జీల పెంపు చాలా సున్నితమైన అంశమన్నారు. అందుకే చాలా తక్కువ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు.

ఖర్చులు పెరిగినా.. స్వల్పంగా పెంపు
సబర్బన్ రైళ్లకు పెంచలేదని, నాన్ సబర్బన్ రైళ్లలో కిలో మీటరుకు ఒక పైసా పెంచారని, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని నాన్-ఏసీ బోగీలకు కిలో మీటరుకు రెండు పైసలు, ఏసీ బోగీలకు కిలో మీటరుకు నాలుగు పైసలు పెంచినట్లు వెల్లడించారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు తర్వాత ఖర్చులు మరింత పెరిగినప్పటికీ ఛార్జీలను అతి స్వల్పంగా పెంచినట్లు తెలిపారు.

సముద్రంలో నీటి చుక్క
చార్జీల పెంపును సముద్రంలో నీటి చుక్కగా అభివర్ణించారు. ప్రయాణీకులకు అందించే సేవలు, సౌకర్యాలస్థాయిని పెంచుకుంటూ వస్తోందన్నారు. స్టేషన్ల శుభ్రత, సమయపాలన, ట్రాక్స్ భద్రత, పాత పరికరాల స్థానంలో కొత్త వాటిని సమకూర్చుకోవడం వంటి విషయాల్లో రైల్వే ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. అలాంటి సమయంలో స్వల్పంగా ఛార్జీలు పెంచకుంటే ప్రయాణీకులకు సేవలు అందించడం కష్టమవుతుందన్నారు.

జనవరి నుంచి పెంపు..
ఇండియన్ రైల్వేస్ ఇటీవల ఛార్జీలను స్వల్పంగా పెంచింది. పెంచిన ఛార్జీలు జనవరి 1, 2020 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌కు కిలో మీటర్‌కు ఒక పైసా చొప్పున పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మెయిల్ సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్‌కు కిలో మీటర్‌కు 2 పైసల చొప్పున పెంచారు. ఏసీ చైర్ కార్, ఏసీ 3,2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్‌కు కి.మీ.కు 4 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సబర్బన్ రైళ్లలో మాత్రం ఛార్జీలు పెంచలేదు. మోడీ అధికారంలోకి వచ్చాక 2014లో ఛార్జీలు పెంచారు.


Click it and Unblock the Notifications