Income Tax: ఈ రోజుల్లో నగదు లావాదేవీల విషయంలో ఆదాయపు పన్ను శాఖ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పైగా డిజిటలైజేషన్ పెరుగుతున్న క్రమంలో ప్రతిదీ రికార్డ్ అవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ హౌసెస్, బ్రోకరేజీల విషయంలోనూ ఇన్కమ్ టాక్స్ శాఖ తన రూల్స్ కఠినతరం చేసింది. వీటిలో పెద్ద మెుత్తంలో నగదు వినియోగిస్తే తప్పక నోటీసులు వస్తాయి. ఈ 5 పనులు చేసేవారికి టాక్స్ నోటీసులు తప్పవు.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్:
ఎవరైనా ఖాతాదారుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు FDలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే వారిపై ఆదాయపు పన్ను శాక కన్నేస్తుంది. వారికి అంత భారీ మెుత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపై వివరణ అడుగుతుంది. అందుకే వీలైతే ఆన్‌లైన్ మాధ్యమం లేదా చెక్ ద్వారా ఎక్కువ డబ్బును FDలో డిపాజిట్ చేయటం ఉత్తమం.

సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు:
ఒక ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా వ్యక్తి తన సేవింగ్స్ అకౌంట్లో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును ఖాతాలో డిపాజిట్ చేస్తే దానిపై కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించవచ్చు. అదే విధంగా కరెండ్ అకౌంట్ హోల్డర్లు తమ ఖాతాలో గరిష్ఠంగా రూ.50 లక్షల పరిమితి వరకు డిపాజిట్ చేయటవచ్చు. వీటికి సంబంధించిన ఆధారాలను అధికారులు నోటీసు ద్వారా అడగవచ్చు.

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు:
ఈ రోజుల్లో శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపుగా క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నారు. అయితే ఎవరైనా ఒకేసారి రూ.లక్ష కంటే ఎక్కువ నగదును క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు కోసం వినియోగిస్తే వారని ఆదాయపుపన్ను అధికారులు తప్పక ప్రశ్నించవచ్చు. అలాగే ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను సదరు కార్డు హోల్డర్ ఆదాయపు పన్ను అధికారులకు వెల్లడించాల్సి ఉంటుంది.

ప్రాపర్టీ లావాదేవీలు:
ఆస్తి రిజిస్ట్రార్‌తో నగదు రూపంలో పెద్ద లావాదేవీ చేస్తే అలాంటి వాటిని ఆదాయపు పన్ను శాఖ ట్రాక్ చేస్తూనే ఉంటుంది. ఎవరైనా వ్యక్తి రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని నగదు రూపంలో చెల్లింపు చేసి కొనుగోలు చేసినట్లయితే లేదా విక్రయించినట్లయితే.. ఆ సమాచారం రిజిస్ట్రార్ తరపున ఆదాయపు పన్ను శాఖకు తప్పక వెళుతుంది. కాబట్టి దీని నుంచి తప్పించుకోవటం అస్సలు కుదరదు. ఇలాంటి సందర్భంలో ఐటీ అధికారులు సదరు వ్యక్తికి నోటీసులు పంపుతారు.

పెట్టుబడులు..
ఎవరైనా వ్యక్తి షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్లు, బాండ్లలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేస్తే.. వారు ఆదాయపు పన్ను అధికారుల నుంచి సమస్యను ఎదుర్కోవచ్చు. ఇలాంటి సాధనాల్లో ఏడాదికి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు మాత్రమే ట్రాన్సాక్షన్లు చేసేందుకు అనుమతి ఉంది. అందుకే పెట్టుబడులు పెట్టాలని భావించే వారు ముందుగా దానికి ఉండే పరిమితులు, రూల్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే అదాయపు పన్ను అధికారుల నుంచి పన్ను నోటీసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


Click it and Unblock the Notifications