gold: మన దేశంలో మహిళలకు బంగారంపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి శుభకార్యం జరగబోతున్నా.. ప్రముఖంగా వివాహాలు, జన్మదినాలకు స్వర్ణాన్ని గిఫ్టుగా ఇస్తుంటారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో ఇండియా టాప్ ప్లేస్ లో ఉంటూ ఉంటుంది. కానీ స్వర్ణ దిగుమతులు ఇటీవల భారీగా పడిపోయినట్లు డేటా చెబుతోంది.
రికార్డు స్థాయిలో బంగారం ధరలతో పాటు అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతల బంగారం డిమాండ్ పెద్దఎత్తున తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా CEO PR సోమసుందరం తెలిపారు. తద్వారా జనవరి-మార్చి త్రైమాసికంలో భారత్ దిగుమతి 112.3 టన్నులకు అంటే 17 శాతం పడిపోయినట్లు వెల్లడించారు. గతేడాది మార్కెట్ టచ్ చేసిన 774 టన్నుల స్థాయిని 2023లో ఇండియా చేరుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు.

'ఈ ఏడాది మొదటి త్రైమాసికం స్వర్ణానికి అంత మంచిగా లేదు. రాబోయే రోజుల్లో రుతుపవనాలు మరియు బంగారం ధరలపై డిమాండ్ ఆధారపడి ఉంటుంది' అని మీడియాకు సోమసుందరం స్పష్టం చేశారు. జనవరి-మార్చి 3 నెలల్లో డిమాండ్ 9 శాతం క్షీణించి దిగుమతి 56 వేల 220 కోట్లకు చేరుకున్నట్లు చెప్పారు.
మార్కెట్లో అధిక ధరలు కారణంగా బంగారం రీసైక్లింగ్ వైపు వ్యాపారులు ఎక్కువగా దృష్టి సారించారు. గతేడాదితో పోలిస్తే ఈ దఫా మార్చి త్రైమాసికంలో ఇది 25 శాతం పెరిగి 34.8 టన్నులకు చేరింది. 2023 ముగిసే నాటికి రీసైక్లింగ్ 100 టన్నులకు వెళ్తుందని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల దిగుమతులు తగ్గుతాయని సోమసుందరం వెల్లడించారు. అయితే ఎంతవరకు తగ్గవచ్చనే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
బంగారంపై దేశంలో పన్నులు 18.5 శాతం వరకు పెరగడంతో, అధిక డిమాండ్ ఉన్న నెలల్లో స్మగ్లింగ్ చాలా ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇతర సమయంతో పోలిస్తే అక్టోబరు-డిసెంబర్ లో ఈ వ్యవహారం మరింత ఊపందుకుంటుంది. జనవరి-మార్చిలో మొత్తం ప్రపంచ బంగారం డిమాండ్ 1,080 టన్నులు కాగా ఇందులో వివిధ సెంట్రల్ బ్యాంకుల వాటా 228 టన్నులు. గతేడాది ఇదే కాలంలో మొత్తం 1,200 టన్నుల డిమాండ్‌లో కేవలం 82 టన్నులు మాత్రమే వారు కొనుగోలు చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications