సాధారణంగా ఉద్యోగంలో జీతం పెరిగితే ఎవరైనా సంతోషిస్తారు. కానీ మన దేశంలోని కొత్త ఆదాయపు పన్ను విధానం (Tax Regime) ప్రకారం, కొన్నిసార్లు స్వల్పంగా పెరిగిన జీతం మీ జేబుకు చిల్లు పెట్టవచ్చు. అంటే, మీకు పెరిగిన జీతం కంటే మీరు కట్టే పన్ను ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీనినే ట్యాక్స్ పరిభాషలో 'మార్జినల్ రిలీఫ్' (Marginal Relief) సమస్య అంటారు. అసలు ఈ నిబంధన ఏమిటి? పెరిగిన జీతం వల్ల పన్ను భారం పెరగకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు చూద్దాం.

రెండు వేర్వేరు సందర్భాలు - షాకింగ్ నిజాలు
ఒక చిన్న ఉదాహరణతో దీనిని అర్థం చేసుకుందాం. కొత్త ట్యాక్స్ విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రిబేట్ లభిస్తుంది.
- సందర్భం 1: ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.13.40 లక్షలు అనుకుందాం. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000 పోగా, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.12.65 లక్షలు అవుతుంది. దీనిపై లెక్కల ప్రకారం రూ.69,750 పన్ను పడుతుంది. కానీ ఆదాయం రూ.12 లక్షల కంటే కేవలం రూ.65,000 మాత్రమే ఎక్కువగా ఉంది కాబట్టి, ప్రభుత్వం 'మార్జినల్ రిలీఫ్' ఇచ్చి పన్నును రూ.65,000 కి తగ్గిస్తుంది.
- సందర్భం 2: ఇప్పుడు అదే వ్యక్తి జీతం రూ.13.50 లక్షలకు పెరిగింది అనుకుందాం (కేవలం రూ.10,000 పెంపు). ఇప్పుడు ట్యాక్సబుల్ ఇన్కమ్ రూ.12.75 లక్షలు అవుతుంది. దీనిపై పన్ను రూ.71,250 పడుతుంది. ఇక్కడ మార్జినల్ రిలీఫ్ వర్తించదు.
అంటే.. కేవలం రూ.10,000 జీతం పెరగడం వల్ల, ఆ వ్యక్తి అదనంగా రూ.6,250 పన్ను కట్టాల్సి వస్తోంది. అంటే పెరిగిన జీతంలో 60 శాతం పైగా పన్ను రూపంలోనే పోతుందన్నమాట!
మార్జినల్ రిలీఫ్ ఎందుకు ఇస్తారు?
ఒక వ్యక్తి ఆదాయం రూ.12,00,000 ఉంటే పన్ను సున్నా. అదే రూ.12,01,000 ఉంటే వేలల్లో పన్ను కట్టాల్సి వస్తే అది అన్యాయం అవుతుంది. అందుకే, పెరిగిన ఆదాయం కంటే పన్ను ఎక్కువగా ఉండకూడదని ప్రభుత్వం ఈ ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే, ఇది ఒక నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ పరిమితి దాటిన వెంటనే పూర్తి పన్ను భారం పడుతుంది.
పన్ను భారం తగ్గించుకోవడానికి చిట్కాలు
కొత్త Tax Regime లో ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ అదనపు భారం నుంచి తప్పించుకోవచ్చు..
- స్టాండర్డ్ డిడక్షన్ వాడకం: రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను సరిగ్గా ఉపయోగించుకుని మీ ట్యాక్సబుల్ ఆదాయాన్ని తగ్గించుకోండి.
- బోనస్ ప్లానింగ్: ఒకవేళ మీ ఆదాయం ట్యాక్స్ థ్రెషోల్డ్ (Threshold) కి దగ్గరగా ఉంటే, బోనస్‌లు లేదా ఇతర వేరియబుల్ పేమెంట్లను తదుపరి ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేయడం గురించి ఆలోచించండి.
- పాత వర్సెస్ కొత్త విధానం: మీ పెట్టుబడులు, మినహాయింపులను బట్టి పాత పన్ను విధానం మేలో లేక కొత్తదో ముందే లెక్కించుకోండి.
- స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్: ఆదాయం పెరిగినప్పుడు వచ్చే పన్ను చిక్కులను నివారించడానికి ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్లను సరిగ్గా ఎంచుకోండి.
జీతం పెరగడం ఎప్పుడూ శుభపరిణామమే, కానీ ఇలాంటి పన్ను మెలికలు తెలియనప్పుడు అది మనకు తెలియకుండానే ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి, ట్యాక్స్ ప్లానింగ్ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం ఎప్పుడూ ఉత్తమం.


Click it and Unblock the Notifications