కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా తమ ఉద్యోగం ఉంటుందో లేదోనని చాలామంది అభద్రతా భావంతో ఉన్నారు. ఐటీ, తయారీ, మీడియా రంగాల్లో పని చేస్తోన్న ఉద్యోగులపై నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ముందు ముందు ఉద్యోగ స్థిరత్వం, కెరీర్ పురోగతి కొనసాగడంపై చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. కేవలం భారత్‌లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ అనుమానాలు ఉన్నాయి. ఈ మేరకు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది.

ఏ దేశంలో ఎంతమంది?
సిటీ గ్రూప్ సర్వే ప్రకారం 86% మంది ఉద్యోగులు ఉద్యోగాలు పోతాయోమేననే ఆందోళనతో ఉన్నారు. భారత్‌తో సహా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, హాంగ్‌కాంగ్ దేశాల్లో సర్వే చేసింది. అత్యధికంగా ఇండియాలో 86%, ఉద్యోగాలు, ఉపాధిపై ఆందోళన వ్యక్తం చేశారు. 71% మంది హాంగ్‌కాంగ్‌లో, అమెరికా 41%, ఆస్ట్రేలియా 33% మంది, బ్రిటన్ 31% మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సర్వేను ఏప్రిల్ 23వ తేదీ నుండి ఏప్రిల్ 27వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా నిర్వహించారు.

వ్యాప్తి నియంత్రణ చర్యలపై సంతృప్తి
ఇతర దేశాలతో పోలిస్తే కరోనా వ్యాప్తి నియంత్రణకు భారత్ చేపట్టిన చర్యలపై ఎక్కువ మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఉద్యోగ భద్రతపై ఎక్కువ మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాలో కరోనా వ్యాప్తి ప్రాథమిక దశలోనే ఉందని, కానీ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వాసులు వెల్లడించారు. అదుపులోకి తెచ్చినట్లు హాంగ్‌కాంగ్‌లో తెలిపారు. కరోనా నివారణకు అవలంభిస్తున్న చికిత్సా విధానం, వైద్య సదుపాయాలపై ఇండియాలో 68 శాతం మంది సంతృప్తితో ఉన్నారు. బ్రిటన్‌లో మైనస్ 17% ఉండగా, అమెరికాలో 3%, ఆస్ట్రేలియాలో 60% మంది, హాంగ్‌కాంగ్‌లో 22% మంది సంతృప్తిగా ఉన్నారు.

ఎంతమందికి ఉద్యోగంపై ఆందోళన అంటే
మరోవైపు, మీడియా, ఐటీ, తయారీ రంగాల్లోని నిపుణుల్లో భవిష్యత్తుపై భరోసా లేదని మరో సర్వే వెల్లడించింది. కరోనా నేపథ్యంలో స్థిరత్వం, వృత్తిరీత్యా ప్రగతి అంశాల్లో విశ్వాసం సన్నగిల్లినట్లు పేర్కొన్నారు. తయారీ రంగంలో ప్రతి నలుగురిలో ఒకరు, ఐటీ రంగంలో ప్రతి ఐదుగురిలో ఇద్దరు, మీడియా రంగంలో ప్రతి ఐదుగురిలో ముగ్గురికి తమ ఉద్యోగం, భవిష్యత్తుపై ఆందోళన ఉంది.


Click it and Unblock the Notifications