గోడకు కొట్టిన బంతిలా.. భారత్ అదుర్స్! గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్థికవేత్త
కరోనా-లాక్ డౌన్ ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థలో క్షీణత ఊహించినంతంగా ఉండకపోవచ్చునని ప్రముఖ బ్యాంకర్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు మాజీ హెడ్ కేవీ కామత్ అన్నారు. అంతేకాదు, చాలామంది అనుకున్న దాని కంటే వేగంగా పుంజుకుంటోందని అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థలో U ఆకారపు అభివృద్ధి ఉండవచ్చునని చెప్పారు. ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో కరోనా ప్రభావం, ఆర్థిక వ్యవస్థల గురించి స్పందించారు.

చాలా వేగంగా పుంజుకుంది
రూ.21 లక్షలకోట్ల ప్యాకేజీ సహా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సానుకూలంగా పని చేశాయని కామత్ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని ఆయన ప్రశంసించారు. ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు కొంత ఇబ్బందులు ఎదురు కావొచ్చునని చెప్పారు. వ్యవసాయం చాలా వేగంగా పుంజుకుందని, కరోనా ప్రభావం గ్రామీణ వాతావరణంపై తక్కువగా ఉందని, వ్యవసాయ ఉపాధి ఆశాజనకంగా ఉందన్నారు. అంతేకాదు, భారతీఅగ్రశ్రేణి కంపెనీలు ఇప్పటికీ అతి భారీగా నష్టపోలేదన్నారు.

వీటికి ఇబ్బంది
భారత ఆర్థిక పునరుద్ధరణ మరింత ఆశాజనకంగా ఉండవచ్చునన్నారు. వచ్చే నెల నాటికి వీ షేప్ రికవరీని కూడా కొట్టి పారేయలేమన్నారు. అయితే ఈ మహమ్మారి కారణంగా కొన్ని రంగాలు వేగంగా పుంజుకున్నప్పటికీ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంత ఇబ్బందులను ఎదుర్కోవచ్చునని చెప్పారు. ప్రభుత్వం వృద్ధి పట్టాలు ఎక్కించాలన్నారు.

మైనస్‌లలోకి వెళ్లకపోవచ్చు
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్ కావాలంటే చిన్న వ్యాపారాలు చాలా కీలకమని కేవీ కామత్ చెప్పారు. కరోనా వంటి కీలక టైంలో ఆత్మనిర్భర్ భారత్ సరైనదన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఊహించిన దానికంటే వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. వివిధ ఆర్థికవేత్తలు, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నట్లు భారత జీడీపీ మైనస్‌లోకి వెళ్లే అవకాశాల్లేవన్నారు. ఐఎంఎఫ్, ఎస్ అండ్ పీ వంటి సంస్థల గణాంకాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ముందు ఏం జరుగుతుందో కచ్చితంగా చెప్పడం కష్టమన్నారు. భారత ఎకానమీ మైనస్ 4.5 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్, మైనస్ 5 శాతానికి క్షీణిస్తుందని ఎస్ అండ్ పీ అంచనా వేసింది.

గోడకు కొట్టిన బంతిలా..
భారత ఎకానమీ గోడకు కొట్టిన బంతిలా తిరిగి వేగంగా పుంజుకోగలదని కేవీ కామత్ అన్నారు. పారిశ్రామిక కార్యకలాపాలు గత స్థితికి చేరుకుంటున్నాయని చెప్పారు. 80 శాతం నుండి 90 శాతం సామర్థ్యానికి ఉత్పత్తి చేరుకుంటోందని, పెరుగుతున్న విద్యుత్ వినియోగం వంటి వివిధ అంశాలు ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందనే సంకేతాలు ఇస్తోందన్నారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే బ్యాంకుల మనుగడకు ముప్పు అని కేవీ కామత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్పీఏలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. బ్యాంకింగ్ రంగంలోని సమస్యలను ప్రభుత్వ సహకారంతో అధిగమిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications