జూలై 21వ తేదీతో ముగిసిన వారానికి భారతదేశంలో నిరుద్యోగిత రేటు లాక్ డౌన్ ముందుకు తగ్గింది. మే 3వ తేదీతో ముగిసిన వారానికి నిరుద్యోగిత రేటు 27.1 శాతం ఉండగా, ఇప్పుడు లాక్ డౌన్ ముందు ఉన్న 8.5 శాతానికి తగ్గింది. ఈ మేరకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) తెలిపింది. మార్చిలో నిరుద్యోగిత రేటు 8.75 శాతంగా ఉంది. అయితే ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటుండటంతో నిరుద్యోగిత రేటు తగ్గుతోంది.

పట్టణ నిరుద్యోగిత రేటు ఎక్కువ
నివేదిక ప్రకారం జూన్ నెలలో మొదటి మూడు వారాల్లో వరుసగా 17.5 శాతానికి, 11.6 శాతానికి, తాజాగా 8.5 శాతానికి నిరుద్యోగిత రేటు తగ్గిందని CMIE మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో మహేష్ వ్యాస్ అన్నారు. జూన్ 21వ తేదీతో ముగిసిన వారానికి పట్టణ నిరుద్యోగిత రేటు 11.2 శాతానికి పడిపోయింది. అయినప్పటికీ కరోనా-లాక్ డౌన్‌కు ముందు ఉన్న 9 శాతం నిరుద్యోగ రేటుతో పోలిస్తే 200 బేసిస్ పాయింట్లు ఎక్కువే.

MGNREGA వల్ల గ్రామాల్లో తగ్గిన నిరుద్యోగిత రేటు
ఇదే కాలంలో గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.26 శాతానికి తగ్గింది. అంతకుముందు 8.3 శాతంగా ఉంది. ఫిబ్రవరి, మార్చి నెలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు నిరుద్యోగిత రేటు తగ్గింది. ఫిబ్రవరిలో 7.34 శాతం, ఏప్రిల్‌లో 8.4 శాతంగా ఉంది. ఆ నెలలతో పోలిస్తే తగ్గుదల నమోదయినట్లు వ్యాస్ తెలిపారు. MGNREGA (మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్) స్కీం కింద చాలామందికి ఉపాధి లభించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు తగ్గింది. దీనికి తోడు సకాలంలో వర్షాలు, మెరుగైన విత్తన కార్యకలాపాల వల్ల భారత గ్రామీణ నిరుద్యోగ రేటు తగ్గడానికి సహకరించాయి.

కేంద్రం.. గ్రామీణ ఎఫెక్ట్.. వినియోగ డిమాండ్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ యోజన వంటి చర్యలపై కూడా వ్యాస్ స్పందించారు. అక్టోబర్ నాటికి గ్రామీణ నిరుద్యోగం తక్కువగా ఉంటుందని, కేంద్రం చర్యల వల్ల గ్రామీణ ప్రాంతంలో ఏర్పడిన ఈ పరిస్థితులు వినియోగ డిమాండ్‌ను పెంపొందించేందుకు ఉపయోగపడతాయని ఆశించవచ్చునని చెప్పారు.

ఉద్యోగిత... నిరుద్యోగిత
లాక్ డౌన్ సమయంలో ఉద్యోగిత రేటు 29.9 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత ఏప్రిల్ 19తో ముగిసిన వారంలో 26.1 శాతానికి పడిపోయింది. జూన్ 7వ తేదీన నిరుద్యోగిత రేటు తిరిగి 32.4 శాతానికి చేరుకుంది. జూన్ 14వ తేదీన 35.7 శాతానికి పెరిగింది. మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం MGNREGA వల్ల ఉపాధి పెరిగి, నిరుద్యోగిత రేటు తగ్గిందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications