కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా చాలామంది ఉద్యోగాలు పోయాయి. వ్యాపారాలు లేక, ఉత్పత్తి నిలిచిపోయి వ్యాపారులు, సంస్థలు నష్టపోయాయి. ఇంకెంతో మందికి పూర్తి వేతనాలు రాలేదు. ఈ పరిస్థితుల్లో దాదాపు అందరూ ఖర్చులు తగ్గించుకున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో అత్యవసరం లేదా నిత్యావసర వస్తువులు మినహాయించి ఏ వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. లాక్ డౌన్ లేక వ్యాపారాలులేక, ఉద్యోగం కోల్పోయిన వారు చాలామంది తమ నిల్వ నిధులను, పీఎఫ్ నిధులను ఉపయోగించుకున్నారు.

తప్పలేదు.. బంగారం అమ్మేశారు లేదా రుణాలు తీసుకున్నారు
లాక్ డౌన్ ప్రధానంగా ఉపాధి, ఉద్యోగాలు, ఆదాయం, చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపింది. దీంతో చాలామంది భారతీయులు తమ వద్ద ఉన్న నిల్వ నిధులను ఉపయోగించుకోవడంతో పాటు దాచుకున్న బంగారాన్ని కూడా విక్రయించారట. చాలామంది తమ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం లేదా అవసరమైనప్పుడు దానిని విక్రయించడం చేశారట. చేతిలో డబ్బులు లేకపోవడంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేయవలసి వచ్చిందట.

ఇన్వెస్టర్ల చూపు
కరోనా నేపథ్యంలో గత ఐదారు నెలలుగా పసిడి ధరలు పెరుగుతోన్న విషయం తెలిసిందే. గత నెలలో రష్యా వ్యాక్సీన్ వచ్చాక కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి వెళ్లడంతో మార్చి నుండి జూలై, ఆగస్ట్ మొదటి వారం వరకు ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్టర్లు గోల్డ్ కాయిన్స్, బార్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. పెట్టుబడికి బంగారం స్వర్గధామం. అందుకే ఇలాంటి సంక్షోభం లేదా క్లిష్ట పరిస్థితుల్లో పసిడి వైపు చూస్తారు.

పడిపోయిన రిటైల్ విక్రయాలు
ఇన్వెస్టర్ల విషయాన్ని పక్కన పెడితే బంగారం రిటైల్ కొనుగోళ్లు పండుగలు, శుభకార్యాల సమయంలో ఎక్కువగా ఉంటాయి. కానీ కరోనా కారణంగా రిటైల్ కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. కొనుగోలు ఏమో కానీ కరోనా లాక్ డౌన్ వల్ల ఉన్న బంగారాన్ని కొంతమంది విక్రయించాల్సిన పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. అయితే కొంతమంది ధరలు పెరగడంతో విక్రయించగా, మరికొంతమంది అవసరార్థం విక్రయించారట.


Click it and Unblock the Notifications