ఐటీలో ఉద్యోగాలు పోతాయా, శాలరీ ఎవరికి కట్ చేస్తారు: మోహన్‌దాస్‌పాయ్ ఏమన్నారంటే?
సాఫ్టువేర్ రంగంలో ఈ ఏడాది కొత్త నియామకాలు ఉండవా? వేతనాలలో కోత ఎవరికి ఉంటుంది? ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందా? అంటే ఐటీ రంగంలోని నిపుణులు గత కొద్ది రోజులుగా వీటిపై కొంత ఊరట కల్పించే అంచనాలు చెబుతున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్ దాస్ పాయ్ కూడా ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు పోయే అవకాశం లేదని, కానీ హైరింగ్స్ ఉండవని చెప్పారు. వేతనాల్లో కోత కూడా ఎక్కువ శాలరీ ఉన్న వారికే ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.

ఇంత వేతనం ఉంటే కోత ఉండొచ్చు
ఐటీ పరిశ్రమలో ఈ సంవత్సరం కొత్త నియామకాలు ఉండకపోవచ్చునని, అలాగే కరోనా మహమ్మారి కారణంగా సీనియర్ సిబ్బంది వేతనాలలో కూడా 20 శాతం నుండి 25 శాతం కోత ఉండవచ్చునని టీవీ మోహన్‌దాస్ పాయ్ అన్నారు. రూ.75,000 అంతకుమించి శాలరీ ఉన్న వారికి వేతనాల్లో 20 శాతం నుండి 25 శాతం వరకు కోత ఉండే అవకాశాలు ఉన్నాయని, అంతకంటే తక్కువ వేతనం ఉంటే కోత ఉండకపోవచ్చునని చెప్పారు. ప్రమోషన్స్ ఉండవచ్చు కానీ ఇంక్రిమెంట్స్ ఉండకపోవచ్చునని చెప్పారు.

ఆఫీస్.. ఆఫీస్ స్పేస్
లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ నిబంధనల నేపథ్యంలో ఆఫీస్‌లలో పని చేసేందుకు ఏర్పడిన ఇబ్బందులను ఐటీ ఇండస్ట్రీ సమర్థవంతంగా అధిగమించిందని ఆయన చెప్పారు. 90 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారని గుర్తు చేశారు. మరి కొన్నాళ్ల పాటు ఐటీ కంపెనీల కార్యాలయ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఉండకపోవచ్చునని చెప్పారు.

కొత్త నియామకాలు మాత్రం ఉండకపోవచ్చు
ఇప్పటి వరకు ఎవరైనా ఉద్యోగం మానేస్తే ఆ ఖాళీని మరొకరి ద్వారా పూరిస్తుంది. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎవరైనా ఉద్యోగం మానేసినా కొత్త నియామకాలు ఉండకపోవచ్చునని టీవీ మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ త్రైమాసికం, వచ్చే త్రైమాసికం చాలా క్లిష్టంగా ఉండవచ్చునని అందుకే ఐటీ కంపెనీలు ఉద్యోగం మానివేసిన వారికి బదులు మరొకరిని తీసుకోకపోవచ్చునని చెప్పారు.

వారికి అవకాశం కల్పిస్తాయి
కొత్త నియామకాలు లేకపోయినప్పటికీ ఇప్పటికే ఇచ్చిన ఆఫర్ లెటర్స్‌ను మాత్రం ఐటీ కంపెనీలు గౌరవిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు ఇప్పటికే ఆ ప్రకటన చేశాయి. హైరింగ్స్ నిలిపివేసి, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌కు వేతనాల్లో కోత విధించవచ్చునని చెప్పారు. లాక్ డౌన్ తర్వాత నుండి ఐటీ కంపెనీలు 25 శాతం నుండి 30 శాతం మధ్య ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.


Click it and Unblock the Notifications