పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సమాచారాన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులతో పంచుకునేందుకు ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అనుమతి ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT). ఈ మేరకు CBDT ప్రకటించింది. దీంతో ఐటీ అధికారుల వద్ద ఉండే ట్యాక్స్ పేయర్స్ సమాచారం ఇక వాణిజ్య బ్యాంకులకు అందుబాటులోకి ఉంటుంది. బ్యాంకులు తమ ఖాతాదారులకు చేసే వివిధ చెల్లింపుల్లో మూలంలో పన్ను కోత (TDS) ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు.

వివరాలు పంచుకోవచ్చు.. ఈ వెసులుబాటు
వాణిజ్య బ్యాంకులతో ఆదాయపుపన్ను అధికారులు వివరాలు పంచుకోవచ్చునని సీబీడీటీ ఆగస్ట్ 31వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. అలా అయితే బ్యాంకులు తమ కస్టమర్లకు వివిధ చెల్లింపులపై టీడీఎస్ మినహాయింపుని నిర్ణయించుకునే విషయంలో వెసులుబాటు కలుగుతుంది. ఆర్బీఐ యాక్ట్, 1934 రెండో షెడ్యూల్, ఐటీ చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం సమాచారం పంచుకోవచ్చునని తెలిపింది.

వరుసగా ఈ తరహా నోటిఫికేషన్లు
సెక్షన్ 138 అనేది ఐటీ అధికారులు ఇతర ఏజెన్సీలతో తమ పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని, వివరాలను పంచుకునే అధికారం కల్పిస్తుంది. ప్రస్తుతం బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న వివిధ రకాల పాలనాపరమైన ఇబ్బందులు ఈ పరిణామంతో తొలగిపోయే అవకాశాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఇటీవలే ఇదే తరహా నోటిఫికేషన్ జారీ చేసింది సీబీడీటీ. ట్యాక్స్ అధికారులు.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (SEBI), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి వాటితో సమాచారం పంచుకోవచ్చునని తెలిపింది.

సమస్యలు తగ్గుముఖం
పన్ను చెల్లింపుదారుల నుండి అందుకున్న సమాచారాన్ని పన్ను అధికారులు బ్యాంకులతో పంచుకుంటే ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న వివిధ పరిపాలనాపరమైన సమస్యలు తగ్గిపోతాయని అంటున్నారు. వినియోగదారులకు వివిధ చెల్లింపులపై టీడీఎస్ తగ్గింపును నిర్ణయించేందుకు వాణిజ్య బ్యాంకుల భారాన్ని తగ్గిస్తుందంటున్నారు.


Click it and Unblock the Notifications