Bitcoin Vs Gold: బంగారం Vs బిట్‌కాయిన్.. ఈ దీపావళికి ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్..?
Bitcoin Vs Gold: దీపావళి సీజన్ ధనత్రయోదశి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో భారత్‌లో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటికే పసిడి ప్రియులు గోల్డ్ కొనేందుకు షాపులకు క్యూకట్టడంతో దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. మహిళలు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఈ కాలంలో ఉత్సాహం చూపటమే అనూహ్య డిమాండ్ కు కారణం.

బంగారం Vs బిట్‌కాయిన్
ఆర్థిక అస్థిరతలు, ప్రతికూల సమయాల్లో బంగారాన్ని సురక్షితమైనదిగా, పెట్టుబడులకు స్వర్గధామంగా పరిగణిస్తారు. అయితే గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన గోల్డ్.. పెరుగుతున్న డిమాండ్ తో పాటు పెరగటం ప్రారంభమైంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీల హవా నడుస్తున్న క్రమంలో బంగారం దానితో పోటీ పడగలదా అనే విషయం ఇంకా సందేహాస్పదమనే చెప్పుకోవాలి.

డిజిటల్ గోల్డ్..
బిట్‌కాయిన్‌ని డిజిటల్ గోల్డ్‌గా చాలా మంది భావిస్తున్నారు. అయితే ప్రస్తుత తరుణంలో దీపావళి సీజన్‌లో పెట్టుబడికి ఏది మంచిది..? పెట్టుబడిదారుల ప్రాధాన్యతలు ఏమిటి..? అనే ప్రశ్నలు అందరి మదిలోనూ ఉన్నాయి. బంగారానికి ఉన్న అనేక లక్షణాలను బిట్‌కాయిన్ కలిగి ఉందని నిపుణులు అంటున్నారు. అందుకే వారు దానిని డిజిటల్ గోల్డ్ గా పిలుస్తున్నారు.

రెండింటిలో ఏది బెటర్..
గత 5 దీపావళిల డేటా ప్రకారం.. బంగారం కంటే బిట్‌కాయిన్ ఎక్కువ లాభదాయకంగా ఉంది. అక్టోబర్ 19, 2017 దీపావళి రోజున ఇది 312.5% పెరుగుదలను చూసింది. ఆ సమయంలో బంగారం ధర 29.5 శాతం మాత్రమే పెరిగింది. అలాగే నవంబర్ 6, 2018 దీపావళి రోజున బిట్‌కాయిన్ 196.3% పెరగగా.. గోల్డ్ ధర 36.% పెరిగింది.

బిట్‌కాయిన్ మంచిదేనా..?
బిట్‌కాయిన్‌తో పోలిస్తే బంగారం లాభాలు తక్కువేనని చెప్పుకోవాలి. అయితే 2017 తర్వాత.. బిట్‌కాయిన్ విలువ భారీగా పతనం కావటం ప్రారంభించింది. 2019లో బిట్‌కాయిన్ ధర 99.9%, బంగారం ధర 11% పడిపోయాయి. అయితే బిట్‌కాయిన్ నేటికీ కొంత మెరుగైన స్థితిలోనే ఉంది.

స్థిరత్వం దేనిలో..
2021లో బిట్ కాయిన్, బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కాబట్టి గత 5 సంవత్సరాల్లో రెండింటితో పోలిస్తే బంగారం లాభాలను తక్కువగానే అందించింది. కానీ అది స్థిరంగా కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు లేని బిట్‌కాయిన్ కొంచెం ఎక్కువ అస్థిరంగానే కనిపిస్తోంది. అయితే రెండింటిలో ఉండే రిస్క్, కలిగే నష్టాలను అంచనా వేసుకున్న తర్వాత పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం.