ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్: శాలరీ పెంపు, ప్రమోషన్లు లేవు, కొత్త ఆఫర్లకు ఓకే
బెంగళూరు: కరోనా మహమ్మారి కారణంగా ఐటి కంపెనీల లాభాలు తగ్గుతోన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్, ప్రపంచవ్యాప్తంగా ప్రజాజీవనం స్తంభించింది. దీంతో వ్యాపారాలు మూతబడ్డాయి. ఉత్పత్తి-డిమాండ్ లేక ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఐటీ సంస్థల క్లయింట్స్ ఇప్పుడు తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నారు. ఈ ప్రభావం ఐటీ సంస్థలపై పడుతోంది. ఇప్పటికే విప్రో, టీసీఎస్ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇన్ఫోసిస్ కూడా అదే బాటలో నడిచింది.

వేతన పెంపు నిలిపివేత, ఆఫర్ లెటర్స్‌కు ఓకే
వేతన పెంపు, ప్రమోషన్లు నిలిపివేస్తున్నట్లు ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సోమవారం ప్రకటించింది. అదే సమయంలో తాము ఇది వరకే ఇచ్చిన ఆఫర్ లెటర్స్‌కు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ మాట్లాడుతూ... 93 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని చెప్పారు. వేగంగా మారుతున్న పరిస్థితుల్లో తమ క్లయింట్స్‌కు స్థిరమైన సేవలు అందిస్తున్నామన్నారు. కరోనా కారణంగా షార్ట్ టర్మ్‌లో సవాళ్లు ఉన్నాయని, అయితే ఈ పరిస్థితుల నుండి తాము బయటపడతామని సలీల్ పరేఖ్ అన్నారు. ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. కరోనా కారణంగా మార్చి చివరి రెండు వారాలపై ప్రభావం పడిందని చెప్పారు.

ఇన్ఫోసిస్ క్వార్టర్ 4 ఫలితాలు
ఇదిలా ఉండగా ఇన్ఫోసిస్ మార్చి 2020 క్వార్టర్‌లో 6.3%తో రూ.4,335 ఏకీకృత నెట్ ప్రాఫిట్ నమోదు చేసింది. అయితే కరోనా అస్థిరత కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం (2020-21 రెవెన్యూ అంచనాలను ఇప్పుడే చెప్పలేమని తెలిపింది. ఈ క్వార్టర్‌లో రాబడి 8% ఎగిసి రూ 23,267 కోట్లకు చేరిందని పేర్కొంది. షేర్‌కు రూ.9.50 చొప్పున ఫైనల్ డివిడెండ్ ప్రకటించింది.

టీసీఎస్, విప్రో ఏం చెప్పాయంటే
తమ సంస్థలో ఉద్యోగులను తొలగించమని, కానీ వేతన పెంపులు మాత్రం ఉండవని టీసీఎస్ ఇప్పటికే తెలిపింది. ఇప్పటికే ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికి అవకాశం కల్పిస్తామని చెప్పింది. ప్రమోషన్లు బిజినెస్ పైన ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పింది. అలాగే, తమ కంపెనీలో శాలరీ హైక్ ఉండదని, ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని, హైరింగ్ నెమ్మదిస్తుందని విప్రో ఇదివరకే ప్రకటించింది.


Click it and Unblock the Notifications