ఉద్యోగులకు వచ్చే ఏడాది శాలరీ పెంపు 9.3 శాతం, చైనా కంటే చాలా ఎక్కువ
2022 సంవత్సరంలో భారత కంపెనీలు సగటున 9.3 శాతం వేతన పెంపును అమలు చేసే అవకాశముందని, ఆసియా - పసిఫిక్ ప్రాంతంలోనే ఇది గరిష్టమని ప్రముఖ అడ్వైజరీ అండ్ కన్సల్టెన్సీ విల్లీస్ టవర్స్ వాట్సన్ బుధవారం వెల్లడించింది. వచ్చే సంవత్సరంలో మెరుగైన వ్యాపార దృక్పథం నేపథ్యంలో కంపెనీల్లో ఆట్రిషన్ (వలసలు) ఎక్కువగా ఉండటం, ఆశావాదం మధ్య శాలరీ హైక్ ఎక్కువగా ఉండవచ్చునని తెలిపింది. అదే సమయంలో చైనాలో ఈ వేతన పెంపు 6 శాతంగా పేర్కొంది. సింగపూర్, ఆస్ట్రేలియన్ కంపెనీల్లో 3.8 శాతం చొప్పున, వియత్నాంలో 8 శాతంగా ఉండవచ్చునని పేర్కొంది. ఈ దేశాలు కరోనా నుండి కోలుకొని అద్భుతమైన డొమెస్టిక్ ఎకనమిక్ ఔట్ లుక్‌తో ఉంటాయని పేర్కొంది. గతంలో మరో సర్వే సంస్థ అయోన్ శాలరీ సర్వే కూడా సెప్టెంబర్ నెలలో ఈ తరహా సర్వే నిర్వహించింది. భారత్‌లో 9.4 శాతం వరకు వేతన పెంపు ఉండవచ్చునని పేర్కొంది. ఐటీ, రిటైల్, ఫార్మా రంగాల్లో అత్యధిక వేతన పెంపు ఉండవచ్చునని పేర్కొంది.

8 శాతం వేతన పెంపు కంటే అధికం
2021లో కంపెనీలు ఇచ్చిన 8 శాతం వేతన పెంపు కంటే ఇది అధికమని, కంపెనీలు ఆర్థిక సంక్షోభం నుండి క్రమంగా బయటపడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల నుండి వలసల సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులను అట్టి పెట్టుకోవడానికి కంపెనీలు వేతన పెంపును అమలు చేయవచ్చునని చెబుతున్నారు. ఇప్పటికే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2021లో భారత్ అత్యధిక వేతన పెంపును అమలు చేసిందని చెబుతోంది. ఈ మేరకు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 1405 కంపెనీల నుండి సర్వే వివరాలు సేకరించింది. ఇందులో భారత్ నుండి 435 కంపెనీలు ఉన్నాయి.

ఈ రంగాల్లో నియామకాలు
ఆర్థిక రికవరీ అంశానికి సంబంధించి.. వచ్చే ఏడాది సానుకూల వాతావరణం ఉంటుందని 52.2 శాతం సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. డిసెంబర్ త్రైమాసికంలో 37 శాతం నుండి వచ్చే సంవత్సరానికి సానుకూల వ్యాపార ఆదాయాన్ని అంచనా వేస్తున్నాయి. వ్యాపారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇది నియామకాలు పెరగడానికి దోహదపడుతుందని, ఈ కాలంలో 30 శాతం సంస్థలు నియామకాలు చేపట్టాలని భావిస్తున్నాయని, ఇది గత ఏడాది కంటే దాదాపు మూడు రెట్లు అని తెలిపింది. హైరింగ్స్ విషయానికి వస్తే ఇంజినీరింగ్‍లో అత్యధికంగా అవకాశాలు ఉండవచ్చునని తెలిపింది. ఇంజినీరింగ్ (57.5%), IT (53.4%), టెక్నికల్లీ స్కిల్డ్ ట్రేడ్స్ (34.2%), సేల్స్ (37%), ఫైనాన్స్ (11.6%) రంగాల్లో వేతన పెంపు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.

అధిక వేతన బడ్జెట్
పెరిగిన వ్యాపార ఆశావాద దృక్పథం అధిక వేతన బడ్జెట్, పెరగనున్న నియామక కార్యకలాపాలకు నిదర్శనంగా మారుతాయని చెబుతున్నారు. గత ఏడాది కరోనా కారణంగా తక్కువ వేతనాలు, ఇంక్రిమెంట్స్ కనిపించాయని, వచ్చే సంవత్సరం ఇది మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications